Panjagutta Police staff: హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లోని సిబ్బంది మొత్తాన్ని బదిలీ చేశారు. ఇన్‌స్పెక్టర్ దగ్గర నుంచి హోంగార్డుల వరకు అందర్నీ ఏఆర్ కు సీపీ శ్రీనివాస్ రెడ్డి అటాచ్ చేశారు. దాదాపు 86 మంది సిబ్బందిని ఒకేసారి బదిలీ చేయడం ఇదే మొదటిసారి. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ వ్యవహారంతో పాటు కీలకమైన విషయాలు బయటకి పొక్కడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, మాజీ ప్రభుత్వ పెద్దలకు సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేస్తున్నారని ఆరోపణలపై సీపీ బదిలీ వేటు వేశారు. నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి కొత్తగా సిబ్బందిని పంజాగుట్టకు నియామకం చేపట్టారు.
Read Also: Fighter : ఓటీటీలోకి వచ్చేస్తున్న హృతిక్ రోషన్ ‘ఫైటర్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
ఇప్పటికే బీఆర్ఎస్ బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కేసులో ఇన్ స్పెక్టర్ దుర్గారావుని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్ చేశారు. మాజీ ఇన్స్పెక్టర్ దుర్గారావు పై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. అయితే, రాహెల్ కేసులో ప్రస్తుతానికి పరారీలో ఉన్న మాజీ ఇన్స్పెక్టర్ దుర్గారావు.. సెక్యూరిటీతో పాటు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన సమాచారం సైతం లీకైనట్లుగా సీపీ గుర్తించారు. అందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెక్యూరిటీ సమాచారాన్ని ఎప్పటికప్పుడు బయటికి లీక్ చేసిన ఘటనపై విచారణ చేస్తున్నట్లు సీపీ తెలిపారు. వారం రోజులుగా అందరి గురించి ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకుంటున్నట్లు సీపీ కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.