Hyderabad: పాతబస్తీ పరిధిలో తీవ్ర కలకలం రేగింది. మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణ చివరకు ఒకరి ప్రాణం తీసింది. ఈ దారుణ ఘటన దబీర్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని చంచల్‌గూడలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. చంచల్‌గూడలోని అంజుమన్-ఎ-మహదవియా, ఎం.ఏ.ఎం. (MAM) ప్లాజా ఫంక్షన్ హాల్‌లో మద్యం మత్తులో ఉన్న ఇద్దరు వ్యక్తుల మధ్య మాటామాటా పెరిగి తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. క్షణికావేశంలో ఒకరిపై ఒకరు పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో తీవ్ర గాయాలపాలైన ఒక వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
సమాచారం అందుకున్న వెంటనే చార్మినార్ జోన్ పరిధిలోని దబీర్‌పురా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, ఘటనా స్థలంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

