పుట్టి నాలుగు రోజులు కూడా కాలేదు.. తల్లి ఒడిలో ఉండాల్సిన పసికందుకు అప్పుడే ధర కట్టారు. ఆ చిన్నారిని రూ.6 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. సీన్ కట్ చేస్తే.. పోలీసుల ఎంట్రీతో మొత్తం ప్లాన్ అంతా బెడిసి కొట్టింది. నిందితులను అదుపులోకి తీసుకుని పసికందును రక్షించారు పోలీసులు. ఈ ఘటన హైదరాబాద్ బాలాపూర్‌లో కలకలం రేపింది. హైదరాబాద్ శివారులోని బాలాపూర్‌లో పసికందు విక్రయం సంచలనం రేకెత్తించింది. ఈ కేసులో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి.. నాలుగు రోజుల పసికందును విక్రయిస్తుండగా ముఠాను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ప్రధాన నిందితురాలితో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
హైదరాబాద్ షాహినగర్‌కు చెందిన మెహెరున్నీసా దంపతులకు పిల్లలు లేరు. దీంతో పిల్లలు కోసం దర్గాలకు వెళ్లి ప్రార్థనలు చేస్తుండేది. ఇదే క్రమంలో మెహెరున్నీసాకు 3 నెలల క్రితం.. బార్కాస్ దర్గాలో వహిదాఖాతూన్ అనే మహిళ పరిచయమైంది. మాటల్లో మెహెరున్నీసా దంపతులకు పిల్లలు లేరన్న విషయం గ్రహించిన వహీదా.. మీకు కుమారుడిని ఇప్పిస్తానని చెప్పింది. పిల్లలకు సంబంధించిన సమాచారం ఇవ్వడం కోసం తరచూ ఫోన్ చేసేది. కొన్ని రోజుల క్రితం మెహెరున్నీసాకు ఫోన్ చేసి మగపిల్లాడు ఉన్నాడనే విషయాన్ని చెప్పింది. కాకపోతే మగ పిల్లాడిని తీసుకోవాలంటే మాత్రం 7 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని చెప్పింది.
మగపిల్లాడి విషయంలో ఇరుపక్షాల మధ్య బేరం కుదరలేదు. దీంతో గత బుధవారం మళ్లీ ఫోన్ చేసిన వహీదాఖాతూన్.. ఆడపిల్ల ఉందని చెప్పి.. ఆరు లక్షల రూపాయలు ఖర్చవుతుందని తెలిపింది. ఐతే ఇద్దరూ కలిసి.. రూ. 5 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. ఐతే ముందు జాగ్రత్తగా మెహెరున్నీసా తన భర్తతో కలిసి ఎర్రగుంటలోని సామాజిక కార్యకర్త సఫియా వాహి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లింది. అలా పసికందును కొనుగోలు చేయడం చట్ట వ్యతిరేకమని చెప్పిన సోషల్ వర్కర్ సఫియా… ఆ తరువాత భార్యాభర్తలిద్దరిని బాలాపూర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లింది. అక్కడ జరిగిన విషయాన్ని.. ఒప్పందాన్ని పోలీసులకు వివరించారు.
మెహరున్నీసా దంపతులు చెప్పిన వివరాలు తెలుసుకున్న పోలీసులు.. పసిబిడ్డలను అమ్ముతున్న గ్యాంగ్‌ను పట్టుకునేందుకు ప్లాన్ రెడీ చేశారు. ఇరుపక్షాలు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఎక్కడ కలుసుకోవాలో చెప్పి ప్లాన్ రెడీ చేశారు. పోలీసుల సూచన మేరకు.. వహీదాఖాతూన్‌కు మెహెరున్నీసా ఫోన్ చేసింది. ఖుబా కాలనీలోని జేజీఆర్ గార్డెన్ వద్ద కలుసుకోవాలని ఇరువర్గాలు నిర్ణయించుకున్నారు. ప్లాన్ ప్రకారం అంతా అక్కడికి వెళ్లారు. పోలీసులు మాటు వేసి.. పసికందును వహీదాఖాతూన్‌తోపాటు మరికొందరిని అరెస్ట్ చేశారు.
వహీదాఖాతూన్‌ని అదుపులోకి తీసుకొని విచారించగా.. ఆ పసికందు పాతబస్తీలోని రియాసత్ నగర్ కు చెందిన అఫ్రియా బేగంకు పుట్టిన బిడ్డగా గుర్తించారు. దీంతో ఆఫ్రీన్ బేగంను.. ఆటో డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు బాలాపూర్ పోలీసులు. పసికందును యూసఫ్ గూడాలోని చిల్డ్రన్ హోమ్‌కు తరలించారు పోలీసులు. ఈ ముఠాలో ఎంతమంది ఉన్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే వహిదాఖాతూన్ గతంలో చిన్నారులు అమ్మకాలను జరిపిందా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. పసిపిల్లలను విక్రయిస్తున్న ఇలాంటి ముఠాలను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

