Heavy Rainfall: తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ సహా కొన్ని ప్రాంతాల్లో అత్యధికంగా వర్షపాతం నమోదైంది.. భారీ వర్షాలతో ఏడు పాయల అమ్మవారి ఆలయం మూసివేశారు అధికారులు.. భారీ వర్షాలతో పూర్తిగా నిండి పొంగిపొర్లుతోంది ఏడు పాయల వన దుర్గా ప్రాజెక్టు.. ఏడు పాయల ఆలయం ఎదుట ప్రమాదకరంగా మంజీరా నది ప్రవహిస్తోంది.. ముందు జాగ్రత్తగా ఆలయాన్ని మూసేశారు అధికారులు. రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పూజలు కొనసాగిస్తున్నారు.. ఇక, కామారెడ్డి జిల్లాలో భారీ వర్ష పాతం నమోదైంది.. గాంధారిలో రాష్ట్రంలోనే అత్యధికంగా 14 సెంటిమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. కామారెడ్డి జిల్లా కేంద్రంలో 10 సెంటిమీటర్ల వర్షపాతం రికార్డు అయ్యింది. భారీ వర్షంతో జిల్లా కేంద్రంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం, రోడ్డుపైకి వర్షపు నీరు చేరింది.. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.. తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లి వాగు పొంగి పొర్లాడంతో 5 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.. ఉధృతంగా తాడ్వాయి మండలంలోని భీమేశ్వర వాగు ప్రవహిస్తోంది. భారీ వర్షానికి వరి పంట నీటమునింది..
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి.. నిన్న ఉదయం నుంచి వాన కురుస్తూనే ఉంది.. సంగారెడ్డి, మెదక్ జిల్లా వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి.. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షపాతం నమోదయ్యాయి. మెదక్ జిల్లా మాసాయిపేటలో అత్యధికంగా 12 సెం. మీ వర్షపాతం.. చిట్కుల్ లో 11.7, నర్సాపూర్ 10, వెల్దుర్తి లో 10 సెం. మీ భారీ వర్షపాతం నమోదు కాగా.. సంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా లక్ష్మీ సాగర్ లో 11.7 సెం. మీ వర్షపాతం.. సంగారెడ్డి 10, కొండాపూర్ 9.7, ఆందోల్ 9 సెం. మీ వర్షపాతం నమోదు అయ్యింది. సిద్దిపేట జిల్లాలో అత్యధికంగా రాఘవపూర్ లో 9.7 సెం. మీ వర్షపాతం నమోదు.. నారాయణరావుపేటలో 9.4, తొగుటలో 7.8 సెం. మీ వర్షపాతం నమోదు అయ్యింది.. ఇక, హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురుస్తోంది. శేరిలింగంపల్లి నియోజక వర్గంలో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురియడంతో చందానగర్, మియాపూర్, మదినగూడ, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, రాయదుర్గం సహా
పలు ప్రాంతాలలో భారీ వర్షం నమోదు అయ్యింది.. వర్షపు నీరు రోడ్లపైకి చేరడంతో ఇబ్బంది పడుతున్న వాహనదారులు పాదాచారులు. ఇక, వికారాబాద్ జిల్లాలో మళ్లీ కుండపోత వర్షం కురుస్తోంది.. జిల్లాలో వాగుల దగ్గర పలుచోట్ల రాకపోకులకు అంతరాయం ఏర్పడింది.. మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. మోమిన్ పేటలో 10.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. గత రెండు రోజులుగా మూసి పరివాహ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో.. గండిపేటకు భారీగా వచ్చి చేరుతోంది వరద నీరు.. మరికొన్ని గంటల్లో గేట్ లు తెరిచే అవకాశం ఉంది. జంట జలాశయాల పరిసర ప్రాంతాల్లో వాసులను అప్రమత్తం చేస్తున్నారు అధికారులు.
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో GHMC, వాటర్ వర్క్స్, ఎలెక్ట్రికల్, EVDM, కలెక్టర్ తదితర శాఖల అధికారులతో మాట్లాడారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బందులకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్న ఆయన.. ఎక్కడ నీరు నిలిచిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. చెట్లు, కొమ్మలు కూలిన చోట నుండి వెంటనే తొలగించాలని ఆదేశించారు. హుస్సేన్ సాగర్, ఉస్మాన్ సాగర్ వాటర్ లెవెల్స్ ను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలి.. నాలాల వద్ద ప్రత్యేక పర్యవేక్షణ జరపాలి.. ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి తగు చర్యలు చేపట్టాలి.. ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలని సూచించారు. అత్యవసర సేవలకు GHMC కంట్రోల్ రూమ్ ను సంప్రదించాలని కోరారు అధికారులు..
ఇక, ఈ రోజు హైదరాబాద్ సహా పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావారణ శాఖ.. హైదరాబాద్‌లో మరో మూడు గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.. గంట పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు.. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.. హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్ జారీ చేయగా.. 11 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు, 18 జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ఎల్లో హెచ్చరికలు జారీ అయిన జిల్లాల్లో మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, వికారాబాద్ ఉండగా.. మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు.