Hyderabad: హైదరాబాద్‌లో పలు ప్రైవేట్ ఇంటర్మీడియట్ కళాశాలల తీరు కలకలం రేపింది. హైడ్రా (HYDRAA) కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి, నకిలీ ఫైర్ ఎన్ఓసీ (NOC)లు సృష్టించిన 8 ప్రైవేట్ ఇంటర్మీడియట్ కళాశాలలపై కేసు నమోదైంది. విద్యార్థుల భద్రత దృష్ట్యా ఇంటర్ కళాశాలలకు ఫైర్ ఎన్ఓసీలు జారీ చేసే బాధ్యతను హైడ్రా నిర్వహిస్తోంది. అయితే, హైడ్రా ఎలాంటి ఎన్ఓసీలు ఇవ్వకపోయినప్పటికీ, సదరు 8 యాజమాన్యాలు కమిషనర్ సంతకాన్ని నకిలీగా ఫోర్జరీ చేసి నకిలీ ప్రమాణపత్రాలను తయారు చేశాయి. ఈ నకిలీ ఎన్ఓసీలను ఇంటర్మీడియట్ బోర్డుకు సమర్పించి కాలేజీల అనుమతులు పొందేందుకు ప్రయత్నించాయి. ఇంటర్మీడియట్ బోర్డుకు వివిధ కాలేజీల నుంచి వచ్చిన మొత్తం 76 ఎన్ఓసీలను పరిశీలించగా, అందులో 8 కాలేజీలు సమర్పించినవి పక్కా నకిలీ ఎన్ఓసీలుగా హైడ్రా అధికారులు గుర్తించారు. ఈ దారుణంపై హైడ్రా అడిషనల్ డైరెక్టర్ లేక్ పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు 8 ప్రైవేట్ ఇంటర్ కాలేజీలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. ఫోర్జరీకి పాల్పడిన ఈ 8 కాలేజీల గుర్తింపును తక్షణమే రద్దు చేయాలని కోరుతూ ఇంటర్మీడియట్ బోర్డుకు కూడా హైడ్రా అధికారులు విజ్ఞప్తి చేశారు.
Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు

Av Ranganath
