Site icon NTV Telugu

Human Life Span: మానవులు 120 ఏళ్లు జీవించే రోజు ఎంతో దూరంలో లేదంట!

Human Life Span

Human Life Span

Human Life Span: 20వ శతాబ్దం ప్రారంభం నుంచి సైన్స్, హెల్త్ కేర్ ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందాయి. దీని కారణంగా మానవ జీవిత కాలం కూడా పెరిగింది. అంటే ఇంతకుముందుతో పోలిస్తే ఇప్పుడు మనుషుల వయసు పెరిగింది. వ్యాక్సిన్‌లతో పాటు సరైన చికిత్సా సౌకర్యాల సహాయంతో, మానవులు కొన్ని దశాబ్దాల క్రితం ప్రాణాంతకంగా భావించిన అనేక వ్యాధులను అధిగమిస్తున్నారు. ఆరోగ్య, వైజ్ఞానిక రంగాలలో అభివృద్ధి ఇలాగే కొనసాగితే మనుషులు 120 ఏళ్ల వరకు హాయిగా జీవించే రోజు ఎంతో దూరంలో లేదు. న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం, ఈ శతాబ్దం చివరి నాటికి మానవులు 150 సంవత్సరాలు జీవించడం సాధ్యమవుతుందని డాక్టర్ ఎర్నెస్ట్ వాన్ స్క్వార్జ్ అభిప్రాయపడ్డారు. స్టెమ్ సెల్ పరిశోధన దీనికి కారణమని ఆయన పేర్కొన్నారు.

Also Read: Manipur: మణిపూర్‌లో మరోసారి ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేత

డాక్టర్ ఎర్నెస్ట్ ఎవరు?
అమెరికాకు చెందిన డాక్టర్ ఎర్నెస్ట్ వాన్ స్వ్కార్జ్ ఓ కార్డియాలజిస్ట్. ఆయన ‘సీక్రెట్స్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ, ది సీక్రెట్ వరల్డ్ ఆఫ్ స్టెమ్ సెల్ థెరపీ వంటి పుస్తకాలను రాశారు. ఏళ్లుగా మానవ కణాల అభివృద్ధిపై పరిశోధనలు చేస్తున్నారు. ఆయన తాజా పరిశోధన ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఆరోగ్యవంతులైన వ్యక్తులపై ఆయన చేసిన రీసర్చ్ లో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. స్టెమ్ సెల్ థెరపీని ఉపయోగించి మనిషి శరీరంలో నిర్వీర్యం అవుతున్న కణాలకు పునరుజ్జీవనం కల్పించాలి. తద్వారా కణాలు ఎక్కువ రోజులు మనుగడ సాగించి.. జీవితకాలాన్ని పెంచుతాయనేది ఈ పరిశోధన సారాంశం. దీంతో పాటు జీవన శైలి మార్చుకోవాలని.. మంచి ఆహారం తీసుకోవడంతోపాటు, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు. డాక్టర్ ఎర్నెస్ట్ న్యూయార్క్ పోస్ట్‌తో మాట్లాడుతూ.. రాబోయే సంవత్సరాల్లో మన జీవిత కాలాన్ని పొడిగించగలమని తాను ఆశిస్తున్నానన్నారు. కొన్ని సంవత్సరాలలో ప్రజలు 120 లేదా 150 సంవత్సరాల వరకు జీవించగలుగుతారని ఆయన అభిప్రాయపడ్డారు.

పరిశోధన ఏం చెబుతోంది?
మనుషులు 120-150 ఏళ్లు బతుకుతారని, అయితే మంచాన పడరని, ఆరోగ్యంగా జీవించగలరని డాక్టర్ ఎర్నెస్ట్ స్పష్టం చేశారు. నిపుణులు సామాజికంగా, వృత్తిపరంగా, నాణ్యమైన జీవితాన్ని గడపడానికి ప్రజలు ఎక్కువ కాలం జీవించాలనేది కూడా నిపుణుల లక్ష్యం. దీన్ని సాధించడానికి, ఆరోగ్యకరమైన ఆహారం, రోజువారీ వ్యాయామం వంటి అదనపు కృషి చేయవలసి ఉంటుందని కూడా ఆయన చెప్పారు. 30 ఏళ్లు దాటిన తర్వాత దీర్ఘాయుష్షు పొందాలంటే జీవనశైలిలో ఆరోగ్యకరమైన మార్పులు చేసుకోవాలన్నారు.

Also Read: UPI: పండగ సీజన్ వేళ.. 42 శాతం మంది యూపీఐ చెల్లింపులకే మొగ్గు..

స్టెమ్ సెల్ పరిశోధన గురించి మాట్లాడుతూ, డాక్టర్ ఎర్నెస్ట్ ఇలా అన్నారు. “గత కొన్ని సంవత్సరాలలో, మేము స్టెమ్ సెల్ థెరపీ ఆధారంగా రియాక్టివ్ మెడిసిన్స్ నుండి రీజెనరేటివ్ మెడిసిన్స్‌కి మారాము. అయినప్పటికీ, మూల కణాలను ఎఫ్‌డీఏ ఆమోదించలేదు కానీ ఇది భవిష్యత్తు ఔషధం. ఇక్కడ మేము ఆరోగ్యానికి జరిగిన నష్టాన్ని భర్తీ చేయగలము. దానిని సరిచేయగలము, తద్వారా మనం ఎక్కువ కాలం జీవించగలము.” అని ఆయన అన్నారు. మనం అధికారిక రికార్డులను పరిశీలిస్తే, ఇప్పటివరకు మానవ చరిత్రలో 120 సంవత్సరాల వరకు జీవించిన వ్యక్తి ఒకరు మాత్రమే ఉన్నారు. ఫ్రాన్స్ నివాసి అయిన జీన్ కాల్మెంట్ 1997 సంవత్సరంలో తుది శ్వాస విడిచింది. ఆ సమయంలో ఆమె వయస్సు 122 సంవత్సరాల 164 రోజులు. ఈ దశకు చేరుకున్నది ఆమె ఒక్కరే. అయితే, కాల్మెంట్ యొక్క దీర్ఘాయువు కూడా ప్రశ్నించబడింది. ఆమె కుమార్తె కూడా ఆమెలాగే జీవిస్తున్నట్లు చెప్పబడింది.

Exit mobile version