Site icon NTV Telugu

Mudragada vs Janasena : గిల్లితే గిల్లించుకోవడానికి సినిమా కాదు రాజకీయం..!

Pawan Vs Mudragada

Pawan Vs Mudragada

కామ్‌గా ఉన్న తేనెతుట్టెను కావాలని చేత్తో కదిపి జనసేన నేతలు ఒళ్ళంతా కుళ్ల పొడిపించుకుంటున్నారా? అసలే ఒకాయన చెవిలో జోరీగలాగా పెడుతున్న పోరునే తట్టుకోలేకుంటే… ఇప్పుడు ఇంకొకాయన్ని గిల్లి ఆయనతో రివర్స్‌లో గిచ్చించుకుంటున్నామన్న ఫీలింగ్‌ పెరుగుతోందా? అసలింతకీ ఏంటీ గిల్లుడు-గిచ్చుడు వ్యవహారం? ఈ తగిలించుకోవడాలు, వదిలించుకోవడాలు ఏంటి?

నాపాటికి నేను ఓ మూలన కూర్చుని మాడిపోయిన మసాలా దోశ తింటుంటే…. మీ అంతట మీరే వచ్చి… నాకు వినపడేలా అర్ధమయ్యీ..కానట్టుగా మాట్లాడుకుని.. మేటర్‌ చెప్పకుండా వెళ్ళిపోతామంటే ఎలారా… ఊరుకుంటాను…? నాకు తెలిసి తీరాల్సిందే… ఓ పాపులర్‌ సినిమా డైలాగ్‌ ఇది. సినిమాలో ఎమ్మెస్‌ నారాయణ చెప్పిన ఆ డైలాగ్‌నే కాస్త అటు ఇటుగా రియాల్టీలో ముద్రగడ పద్మనాభం చెప్పాల్సి వస్తోందట. దాదాపుగా ఇదే యాంగిల్‌లో జనసేన మీద ఓ రేంజ్‌లో విరుచుకుపడుతున్నారు ముద్రగడ. కాపులకు రిజర్వేషన్స్‌ కల్పించాలంటూ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యమం చేశారు ఈ మాజీ మంత్రి. తర్వాత జరిగిన పరిణామాలతో, వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఉద్యమ కాడి పడేశారాయన. తర్వాత వైసీపీలో చేరతారన్న ప్రచారం కూడా జరిగింది. వివిధ కారణాలతో అడుగు ముందుకు పడలేదుగానీ… తర్వాత గ్లాస్‌ పార్టీ గూటికి చేరతారని కూడా చెప్పుకున్నారు. అదే సందర్భంలో జనవరి 7న కాపు పెద్దలను ఉద్దేశించి బహిరంగ లేఖ రాశారు పవన్ కళ్యాణ్. కాపులంతా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నది ఆ లేఖ సారాంశం. తర్వాత జనసేన నేతలు ముద్రగడ నివాసానికి వెళ్ళి పవన్ త్వరలోనే స్వయంగా కలిసి పార్టీలోకి ఆహ్వానిస్తారని కూడా క్లారిటీ ఇచ్చారు. కానీ… పవన్ ముద్రగడని కలవ లేదు. ఇక కలిసే అవకాశం కూడా లేదన్న నిర్ధారణకు వచ్చాక తీవ్రంగా హర్టయిన ముద్రగడ.. తమరు నా దగ్గరికి రావడానికి పర్మిషన్ రాలేదనుకుంటా… అంటూ సెటైర్స్‌ వేశారు. జాతి కోసం ఏకమవుదాం అనుకుంటే మీరు ఇచ్చే గౌరవం ఇదేనా అని కూడా ప్రశ్నాస్త్రాలను సంధించారు. పొత్తు అంటే 80 అసెంబ్లీ సీట్లలో పోటీ చేసి రెండేళ్ళు అధికారం షేర్ చేసుకోవాలని, కానీ… ఇలా వ్యవహరిస్తారని అనుకోలేదంటూ లేఖ రాయడంతో మేటర్‌ హీటెక్కింది. దీంతో ఈ ఎపిసోడ్‌ మీద ఇప్పుడు రకరకాల చర్చలు మొదలయ్యాయి.

 

 

ముద్రగడను పార్టీలోకి తీసుకోవాలని జనసేన భావించినా… టీడీపీ నుంచి సానుకూల సంకేతాలు రాలేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. గోదావరి జిల్లాల్లో కూటమికి పవన్ మేనియా సరిపోతుందని చంద్రబాబు నుంచి స్పష్టత వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ముద్రగడ వల్ల కొత్తగా ఒరిగే ప్రయోజనం ఏముందో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని, ఆయన రాక వల్ల కుల ముద్ర పడడం తప్ప ఎక్స్‌ట్రా అడ్వాంటేజ్‌ ఏంటో ఆలోచించుకోమని చంద్రబాబు చెప్పడం వల్లే ముద్రగడ ఎంట్రీకి బ్రేకులు పడ్డట్టు గుసగుసలాడుకుంటున్నారు. చివరిగా అవన్నీ పక్కన పెట్టి…. ఆయన వల్ల ఏదన్నా మంచి జరుగుతుందంటే ఇబ్బంది లేదని, ఒకసారి ప్రాక్టికల్‌గా ఆలోచించాలన్న సూచన రావడంతోనే ముద్రగడ చేరికను హోల్డ్ లో పెట్టిందట జనసేన. ఓవైపు హరిరామ జోగయ్య లేఖలతో కాక పుట్టిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే టీడీపీ-జనసేన కూటమికి పంటి కింద రాయిలా తయారయ్యారాయన. ఇప్పుడు ముద్రగడ కూడా తోడవడంతో సామాజిక సమీకరణలు ఎలా ఉంటాయోనని గోదావరి జిల్లాల కాపు నేతలు తెగ టెన్షన్‌ పడుతున్నారట. అసలు కామ్‌గా తన ప్రయత్నాలేవో తాను చేసుకుంటున్న ముద్రగడను జనసేన నేతలు ఆయన ఇంటికి వెళ్ళిమరీ ఎందుకు కెలుక్కోవాలి? ఇప్పుడు ఆయనతో ఎందుకు గిల్లిచ్చుకోవాలి అన్న సెటైర్స్‌ వేస్తున్నారు. ఆయన పార్టీలోకి రావడం వల్ల లాభం లేకుంటే లేకపోవచ్చు గానీ, ఇలాంటి పరిణామాల వల్ల కచ్చితంగా నష్టం మాత్రం జరుగుతుందని లెక్కలు వేస్తున్నారు కొందరు నేతలు. మొత్తానికి ముద్రగడ వ్యవహారాన్ని సాగదీసుకుని పవన్‌కళ్యాణ్‌ సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టు అయిందన్నది విస్తృత అభిప్రాయం. పవన్‌ను చంద్రబాబు ముద్రగడ దగ్గరికి రానీయలేదన్న కొత్త చర్చ ఎట్నుంచి ఎటు టర్న్ అవుతుందోన ఆందోళన కూడా ఉందట జిల్లా జనసేన నేతల్లో.

Exit mobile version