Water Bottle Cleaning Tips: వేసవి కాలంలో చల్లటి నీళ్లు తాగడం కోసం ఎక్కువగా ప్లాస్టిక్ బాటిళ్లను ఫ్రిజ్‌లో ఉంచడం సాధారణం. అయితే చాలా మంది వాటిని శుభ్రం చేయకుండా నేరుగా ఉపయోగిస్తుంటారు. ఇది ఆరోగ్యానికి హానికరం కావచ్చు. ముఖ్యంగా చాలా రోజులుగా వాడకుండా ఉన్న బాటిళ్లలో దుర్వాసన, బ్యాక్టీరియా ఏర్పడే అవకాశం ఉంటుంది. అందుకే ఫ్రిజ్‌లో పెట్టే ముందు వాటిని తప్పనిసరిగా క్షుణ్ణంగా శుభ్రం చేయడం చాలా ముఖ్యం. చలికాలంలో వాడకుండా మూతపెట్టి ఉంచిన బాటిళ్లు వేసవిలో తీసుకున్నప్పుడు మురికిగా మారి ఉంటాయి. అందులో ఉండే దుర్వాసన నీటి రుచిని కూడా ప్రభావితం చేస్తుంది. ఈ సమస్యలను నివారించడానికి ఇంట్లోనే లభించే సాధారణ పదార్థాలతో సులభంగా శుభ్రం చేసుకోవచ్చు.
* గోరువెచ్చని నీరు మరియు ఉప్పు: ప్లాస్టిక్ బాటిళ్లను శుభ్రం చేయడానికి ఇది చాలా సులభమైన పద్ధతి. గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి బాటిల్‌లో పోసి కొంతసేపు ఉంచాలి. ఉప్పు సహజ శుభ్రపరిచే పదార్థంగా పనిచేసి మురికిని తొలగిస్తుంది. తర్వాత శుభ్రమైన నీటితో కడిగితే బాటిల్ తాజాగా మారుతుంది.
* బేకింగ్ సోడా మరియు నిమ్మరసం: దుర్వాసనను తొలగించడంలో బేకింగ్ సోడా ఎంతో ఉపయోగకరం. బాటిల్‌లో ఒక టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి, నిమ్మరసం పిండి కొద్దిగా గోరువెచ్చని నీరు పోసి 10–15 నిమిషాలు నాననివ్వాలి. తర్వాత బ్రష్‌తో రుద్ది కడిగితే బ్యాక్టీరియా కూడా తొలగిపోతుంది.
* మొండి మరకలకు వెనిగర్: బాటిళ్లలో గట్టిగా ఉన్న మరకలు ఉంటే వెనిగర్ ఉపయోగించడం మంచిది. సగం వెనిగర్, సగం నీరు పోసి రాత్రంతా నాననివ్వాలి. మరుసటి రోజు బాగా కడిగితే మరకలు, దుర్వాసన పూర్తిగా తొలగిపోతాయి.
* బాటిల్ మూతలను కూడా శుభ్రం చేయండి: చాలా మంది బాటిల్ మూతలను పట్టించుకోరు. కానీ అక్కడే ఎక్కువగా క్రిములు ఉంటాయి. కాబట్టి మూతను తీసి బేకింగ్ సోడా కలిపిన గోరువెచ్చని నీటిలో నానబెట్టి శుభ్రం చేయాలి. బ్రష్ లేకపోతే బియ్యపు గింజలు వేసి బాటిల్‌ను ఊపడం ద్వారా లోపలి భాగాన్ని శుభ్రం చేయవచ్చు.
బాటిళ్లను కడగడం మాత్రమే.. కాదు.. కడిగిన తర్వాత వాటిని పూర్తిగా ఆరబెట్టడం చాలా ముఖ్యం. తడి ఉన్నప్పుడు బ్యాక్టీరియా త్వరగా పెరుగుతుంది. కాబట్టి వాటిని తలక్రిందులుగా పెట్టి గాలిలో ఆరనివ్వాలి. పూర్తిగా ఆరిన తర్వాత మాత్రమే ఉపయోగించడం మంచిది. ఇలా చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకుంటే మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.. ఎలాగు వేసవిలో చల్లని నీటి కోసం బాటిల్స్ ఫ్రిజ్‌లో పెడతారు కాబట్టి.. తప్పనిసరిగా పై విధంగా శుభ్రం చేయండి.. ఆరోగ్యాన్ని కాపాడుకోండి..
