Site icon NTV Telugu

Budget 2023: సొంతిల్లు లేనివారికి గుడ్‌న్యూస్.. బడ్జెట్‌లో భారీగా నిధుల కేటాయింపు

Pm Awas Yojana

Pm Awas Yojana

Budget 2023: ఇళ్లు లేని వారికి కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. పేదల సొంతింటి కలను నెరవేర్చేలా బడ్జెట్‌లో ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన నిధులను కేంద్రం భారీగా పెంచింది. పీఎం ఆవాస్ యోజనకు రూ.79 వేల కోట్ల కేటాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో ప్రకటించారు. మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద పీట వేస్తున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజనకు గతంలో కంటే 66 శాతం నిధులను పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించారు.

అదే సమయంలో దేశంలో మౌలిక సదుపాయాల కల్పనకు కూడా కేంద్ర ప్రభుత్వం పెద్ద పీట వేసింది. వరుసగా మూడో ఏడాది భారీగా నిధులను కేటాయించింది. మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.10 లక్షల కోట్లను వెచ్చించనున్నట్లు కేంద్ర మంత్రి సీతారామన్ ప్రకటించారు. ఇది జీడీపీలో 3.3 శాతమని చెప్పారు. 2020లో చేసిన కేటాయింపులతో పోలిస్తే ఇది మూడు రెట్లు అధికమని వివరించారు.

Union Budget 2023: బడ్జెట్‌లో 7 అంశాలకు ప్రాధాన్యత.. సామాన్యుల సాధికారతే లక్ష్యం

పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు కట్టుబడి ఉన్నామని కేంద్రమంత్రి చెప్పారు. ఇందుకోసం ప్రత్యేకంగా అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్​మెంట్ ఫండ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఉన్న గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి తరహాలోనే దీన్ని జాతీయ హౌసింగ్ బ్యాంక్ నిర్వహిస్తుందని స్పష్టం చేశారు. ప్రాంతీయ కనెక్టివిటీని మెరుగుపర్చేందుకు 50 అదనపు ఎయిర్‌పోర్టులు, హెలిప్యాడ్లు, వాటర్ ఏరో డ్రోన్లు, అడ్వాన్స్​డ్ ల్యాండింగ్ గ్రౌండ్లను పునరుద్ధరించనున్నట్లు కేంద్ర మంత్రి పార్లమెంట్‌ బడ్జెట్‌ ప్రకటన నేపథ్యంలో వెల్లడించారు.

Exit mobile version