మరోసారి మణిపూర్ రగిలిపోతుంది. ఇంఫాల్ లోయలోని కొన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. ఈ క్రమంలో.. శనివారం ముగ్గురు భారతీయ జనతా పార్టీ, ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే నివాసాలపై దాడి చేశారు. ఆందోళనకారులు ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ వ్యక్తిగత నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో.. పోలీసులు వారిని అడ్డుకున్నారు.
నవంబర్ 11న భద్రతా దళాలు 10 మంది హ్మార్ పురుషులను చంపారు. ఆ ప్రదేశానికి సమీపంలోని నిర్వాసిత ప్రాంతం శిబిరం నుంచి ఆరుగురు మైతే జాతి వారు అదృశ్యమై చివరికి వారి మృతదేహాలు వెలుగులోకి వచ్చాయి. ఈ పరిణామాలు మణిపూర్‌లో తాజా హింసకు కారణమైయ్యాయి. హతమైన వారిని భద్రతా దళాలు మిలిటెంట్లుగా అభివర్ణించాయి. ఈ క్రమంలో.. శనివారం ఇంఫాల్ లోయలోని వివిధ ప్రాంతాలలో హింసాత్మక నిరసనలు చెలరేగాయి. ఫలితంగా నిరవధిక కర్ఫ్యూ విధించారు. ఇంటర్నెట్ సేవలు కూడా నిలిపివేశారు.
ఎమ్మెల్యేల నివాసాలపై దాడి:
ఇంఫాల్ లోయలోని పలు ప్రాంతాల్లో ఆందోళనకారులు బీజేపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఇళ్లకు నిప్పుపెట్టి ఆస్తులను ధ్వంసం చేశారు. నింగ్‌తౌఖోంగ్‌లో పబ్లిక్ వర్క్స్ మంత్రి గోవిందదాస్ కొంతౌజామ్, హ్యాంగ్లామ్ బజార్‌లో బీజేపీ ఎమ్మెల్యే వై రాధేశ్యామ్, తౌబాల్ జిల్లాలో బీజేపీ ఎమ్మెల్యే పవోనమ్ బ్రోజెన్, కాంగ్రెస్ ఎమ్మెల్యే లోకేశ్వర్ ఇళ్లకు నిప్పుపెట్టినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ సమయంలో ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులు ఇంట్లో లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
ముఖ్యమంత్రి పూర్వీకుల ఇంటిపై దాడి:
ఆందోళనకారులు ఇంఫాల్ తూర్పు జిల్లాలోని లువాంగ్‌సంగ్‌బామ్‌లో ఉన్న బీరెన్ సింగ్ పూర్వీకుల ఇంటిపై కూడా దాడికి ప్రయత్నించారు. అయితే, భద్రతా బలగాలు 100-200 మీటర్ల ముందుగానే వారిని అడ్డుకున్నాయి. దీంతో ఆందోళనకారులు సింగ్ ఇంటికి వెళ్లే ప్రధాన రహదారిపై టైర్లు తగలబెట్టి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు.
కర్ఫ్యూ, ఇంటర్నెట్ సేవలు నిలిపివేత:
పరిస్థితిని అదుపు చేసేందుకు ఇంఫాల్ లోయలోని పలు జిల్లాల్లో పరిపాలన నిరవధిక కర్ఫ్యూ విధించింది. అలాగే ఇంటర్నెట్, మొబైల్ డేటా సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. ముఖ్యమంత్రి అల్లుడు, బీజేపీ ఎమ్మెల్యే రాజ్ కుమార్ ఇమో సింగ్ సహా నేతల ఇళ్లపై దాడులు జరగడంతో ఏడు జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను అధికారులు నిలిపివేశారు.
ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాలి:
రాష్ట్రంలోని పౌర సమాజ సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మణిపూర్ ఇంటిగ్రిటీ కోఆర్డినేషన్ కమిటీ (COCOMI) ఉగ్రవాదులపై సైనిక చర్య తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఆరు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇటీవల మళ్లీ విధించిన AFSPA (సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం)ని తక్షణమే తొలగించాలని కమిటీ విజ్ఞప్తి చేసింది.
నిరసనలు, కాల్పుల ఘటనలు:
జిరిబామ్ పట్టణంలో ఉగ్రవాదులు కనీసం రెండు చర్చిలు, మూడు ఇళ్లకు రాత్రిపూట నిప్పుపెట్టినట్లు అధికారులు తెలిపారు. అంతేకాకుండా.. ఇతర నిర్మాణాలను కాల్చడానికి ప్రయత్నం చేశారు. మణిపూర్‌లో ఈ హింస, ఉద్రిక్తత రాష్ట్ర పౌరులకు తీవ్రమైన సంక్షోభాన్ని సృష్టిస్తోంది. పరిపాలన, భద్రతా బలగాలు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ రాష్ట్రంలో శాంతిభద్రతలను పునరుద్ధరించేందుకు ఇంకా అనేక ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి.