ఏడు అంగుళాల భారీ డిస్‌ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్‌ఫోన్..!

Honor

Honor

HONOR Smartphone: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ప్రస్తుతం భారీ బ్యాటరీల ట్రెండ్ కొనసాగుతోంది. ఇప్పటికే పలు కంపెనీలు 10,000mAhకు పైగా సామర్థ్యం ఉన్న బ్యాటరీలతో ఫోన్లను తీసుకొస్తుండగా.. హానర్ కంపెనీ మరో అడుగు ముందుకేసింది. ఏకంగా 13,300mAh సామర్థ్యం కలిగిన బ్యాటరీని అభివృద్ధి చేసింది. ఈ బ్యాటరీకి చైనాలో 3C సర్టిఫికేషన్ కూడా లభించింది.

13,300mAh బ్యాటరీ

చైనా క్వాలిటీ సర్టిఫికేషన్ సెంటర్ పబ్లిక్ డేటా ప్రకారం.. HB6674118ELW-C మోడల్ నంబర్‌తో ఉన్న ఈ బ్యాటరీకి 2026 నవంబర్ 6న సర్టిఫికేషన్ లభించింది. GB 31241-2022 జాతీయ ప్రమాణం కింద దీనికి ఆమోదం లభించింది. ఈ బ్యాటరీ రేటెడ్ కెపాసిటీ 13,300mAh కాగా, ఎనర్జీ 49.48Wh, నామినల్ వోల్టేజ్ 3.72Vగా ఉంది. దీని తయారీకి సంబంధించిన వివరాల్లో ATL దరఖాస్తుదారుగా, హానర్ తయారీ సంస్థగా నమోదయ్యాయి.

7 అంగుళాల డిస్‌ప్లే

టెక్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ భారీ బ్యాటరీని 7 అంగుళాల డిస్‌ప్లే కలిగిన మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లో ఉపయోగించే అవకాశం ఉంది. HONOR Power3 లేదా X90 Pro Max వంటి మోడళ్లలో ఈ బ్యాటరీ రావచ్చని పలు లీకులు సూచిస్తున్నాయి. 7 అంగుళాల స్క్రీన్‌తో రానున్న మిడ్‌రేంజ్ ఫోన్ల కోసం ఈ బ్యాటరీ ట్రయల్ ప్రొడక్షన్ దశలో ఉంది. 2027లో మరింత అధిక సామర్థ్యం కలిగిన బ్యాటరీలను తీసుకురావడానికి కూడా హానర్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

10,000mAhకు పైగా బ్యాటరీలతో ఫోన్లు

హానర్ గతంలోనూ భారీ బ్యాటరీలతో పలు స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. HONOR Power2లో 10,080mAh సామర్థ్యం కలిగిన Qinghai Lake బ్యాటరీని అందించింది. HONOR WIN RTలో 10,000mAh బ్యాటరీతో పాటు 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 27W రివర్స్ ఛార్జింగ్ సదుపాయాలు ఉన్నాయి. అలాగే HONOR X80 Pro Maxలో 11,000mAh బ్యాటరీ, 90W వైర్డ్ ఛార్జింగ్ అందించింది. HONOR WIN2 సిరీస్‌లోని WIN RT2, WIN Turbo2 మోడళ్లలో 12,070mAh బ్యాటరీని ఉపయోగించింది.

ఇతర బ్రాండ్లు కూడా

భారీ బ్యాటరీల విషయంలో Xiaomi, vivo, iQOO, OPPO వంటి బ్రాండ్లు కూడా పోటీపడుతున్నాయి. ఇప్పటికే 10,000mAh సామర్థ్యం కలిగిన బ్యాటరీలతో పలు మోడళ్లను తీసుకొచ్చాయి. ఈ నేపథ్యంలో 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త ఫోన్‌ను విడుదల చేస్తే స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మరింత ఆసక్తి పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ ఫోన్ విడుదల తేదీ, ధర, పూర్తి ఫీచర్లపై కంపెనీ నుంచి అధికారిక ప్రకటన రాలేదు.