Maratha Reservation: విద్యాసంస్థలు, ఉద్యోగాల్లో మరాఠా వర్గానికి రిజర్వేషన్ కల్పించాలని చేపట్టిన ఆందోళనలు మహారాష్ట్రలో మరోసారి తీవ్రరూపం దాల్చాయి. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) ఎమ్మెల్యే సందీప్ క్షీరసాగర్ ఇంటికి సోమవారం నిప్పు పెట్టారు. ఆయన ఇంటి వద్ద పార్క్ చేసిన వాహనాలకు కూడా నిప్పు పెట్టారు. ఆయన శరద్ పవార్ వర్గానికి చెందిన వ్యక్తి కావడం గమనార్హం.
బీడ్ జిల్లాలో నేషనలిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ (ఎన్‌సీపీ) ఎమ్మెల్యే ప్రకాష్ సోలంకే నివాసాన్ని మరాఠా రిజర్వేషన్ ఆందోళనకారులు సోమవారం ధ్వంసం చేసి, నిప్పంటించారు. సోషల్ మీడియాలో షేర్ చేసిన విజువల్స్‌లో ఆయన బంగ్లాలో భారీ మంటలు, పొగలు చుట్టుపక్కలకు వ్యాపించినట్లు కనిపించింది. ఘటన జరిగినప్పుడు తాను ఇంట్లోనే ఉన్నానని ఎమ్మెల్యే ప్రకాష్ సోలంకే తెలిపారు. అదృష్టవశాత్తూ తన కుటుంబ సభ్యులు లేదా సిబ్బంది ఎవరూ గాయపడలేదని ఆయన వెల్లడించారు. మేమంతా క్షేమంగా ఉన్నామని, కానీ అగ్నిప్రమాదం కారణంగా భారీ ఆస్తి నష్టం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. బీడ్‌లో మాజీ మంత్రి జయదత్తాజీ క్షీరసాగర్ కార్యాలయానికి నిప్పంటించిన మరో ఘటన చోటుచేసుకుంది. ఆయన ఏకనాథ్ షిండే వర్గానికి చెందిన వ్యక్తి. మహారాష్ట్రలోని వడ్గావ్ నింబాల్కర్ గ్రామంలో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ పోస్టర్లను ధ్వంసం చేసి మరాఠా రిజర్వేషన్ ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: Russia: ఉక్రెయిన్ యుద్ధాన్ని అమెరికా పెంచుతోంది.. అగ్రరాజ్యంపై రష్యా మండిపాటు
మహారాష్ట్రలో ఉద్యోగాలు, ద్యలో మరాఠా కోటాలను కోరుతూ జరిగిన ఆందోళనలు ఇటీవల ముఖ్యాంశాలుగా మారాయి. రిజర్వేషన్ అంశంపై శివసేన నాయకుడు హేమంత్ పాటిల్ హింగోలి ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు. యవత్మాల్‌లోని నిరసన వేదిక వద్ద ఆయన తన రాజీనామా లేఖ రాశారు. ఎంపీ రాజీనామాపై స్పందిస్తూ, అక్టోబర్ 25 నుండి నిరాహార దీక్ష చేస్తున్న మనోజ్ జరంగే పాటిల్, ఈ సమస్యను పరిష్కరించడానికి రాష్ట్రంలోని మరాఠా ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని పిలవాలని సూచించారు. మరాఠా సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ సామాజిక కార్యకర్త మనోన్ జరంగే పాటిల్ అక్టోబర్ 25 నుంచి జాల్నా జిల్లా అంతర్వాలి సారథి గ్రామంలో ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించారు. ఏ రాజకీయ నాయకుడిని గ్రామంలోకి అనుమతించవద్దని పాటిల్ కోరడంతో, గ్రామస్థులు ఏ రాజకీయ పార్టీ నాయకుడిని గ్రామంలోకి అనుమతించలేదు. జిల్లా అధికారులు, వైద్యులు వైద్యపరీక్షలు చేసేందుకు ప్రయత్నించినా.. నిరాకరిస్తున్నారు. ఆయన ఆరోగ్యంపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్న తరుణంలో మహారాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు తీవ్రమయ్యాయి.