NTV Telugu Site icon

HMDA: సైకిల్ ట్రాక్ పైకప్పును తొలగించడంపై హెచ్ఎండీఏ వివరణ

Cycle Track

Cycle Track

HMDA: సైకిల్ ట్రాక్ పైకప్పును తొలగించడంపై హెచ్ఎండీఏ వివరణ ఇచ్చింది. నార్సింగి, పుప్పాలగూడ ప్రాంతాల నుంచి నానక్‌రామ్‌గూడ రోటరీ మీదుగా ఐటీ కారీడార్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, శేర్లింగంపల్లి, గచ్చిబౌలి, రాయదుర్గం, ఐకియా, మాదాపూర్ ప్రాంతాలకు పెద్ద సంఖ్యలో రాకపోకలు కొనసాగుతున్నాయని తెలిపింది. ట్రాఫిక్ రద్దీ ఎక్కువ ఉన్న సమయంలో నానక్‌రామ్‌గూడ రోటరీ మొత్తం స్తంభిస్తున్నట్లు వెల్లడించింది. గచ్చిబౌలి నుండి నార్సింగి, మణికొండ వైపు వెళ్లే ప్రయాణికులు ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు మీద వెళ్తున్నారని ట్రాఫిక్ పోలీసుల ద్వారా సమాచారం అందిందని హెచ్‌ఎండీఏ తెలిపింది. దీనివల్ల నానక్‌రామ్‌గూడ రోటరీలో కాజాగూడ వైపు భారీ ట్రాఫిక్ జామ్‌కు కారణం అవుతోందని వివరించింది.

Read Also: PROTECT: సైబర్‌ నేరాల నివారణ కోసం ప్రాజెక్ట్ ప్రొటెక్ట్ ప్రారంభం

నానక్ రామ్ గూడ రోటరీ వద్ద దిగకుండా.., నార్సింగి సర్వీస్ రోడ్ వైపు వెళ్లడానికి నానక్‌రామ్‌గూడ టోల్ ప్లాజా ముందు కొత్త డౌన్ ర్యాంపును అభివృద్ధి చేయాలని ప్రతిపాదించడం జరిగిందని తెలిపింది. ఆగస్టు 31న జీహెచ్‌ఎంసీ 66వ కన్వర్జెన్స్ మీటింగ్‌లో దీనిపై చర్చ జరిగినట్లు పేర్కొంది. నానక్‌రామ్‌గూడ రోటరీ వద్ద ట్రాఫిక్ తగ్గించేందుకు, దేవి ఆలయం వద్ద ర్యాంప్‌ను అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకోవాలని చాలా మంది హెచ్ఎండీఏను అభ్యర్థించారు.దీని ప్రకారం 120 మీటర్ల పొడవుతో కొత్త ర్యాంప్ నిర్మాణానికి ప్రతిపాదన సిద్ధమైంది. కొత్త ర్యాంప్ సైకిల్ ట్రాక్ మీదుగా దాటనున్నందున.. 80 మీటర్ల సైకిల్ ట్రాక్ రూఫ్ తొలగించబడిందని హెచ్‌ఎండీఏ వివరించింది.