HMDA Chief Engineer Asset: హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) చీఫ్ ఇంజనీర్ రవీందర్ నివాసంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) చేపట్టిన సోదాలు ముగిశాయి. దాదాపు 20 గంటల పాటు సాగిన ఈ తనిఖీల్లో రవీందర్‌కు చెందిన సుమారు రూ.100 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. సోదాలు తర్వాత ఆయనను అదుపులోకి తీసుకుని ఏసీబీ కార్యాలయానికి తరలించారు.
నానక్‌రాంగూడలోని రవీందర్ నివాసంతో పాటు మరో పది ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు భారీ మొత్తంలో స్థిర, చర ఆస్తులకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వైద్య పరీక్షల కోసం ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లిన అనంతరం ఆయనను నాంపల్లిలోని ఏసీబీ కార్యాలయానికి తరలించి, అక్కడి నుంచి కోర్టులో హాజరుపరిచారు. ప్రాథమిక దర్యాప్తులో రవీందర్ పేరుపై నార్సింగి, నానక్‌రాంగూడ ప్రాంతాల్లో నాలుగు రెసిడెన్షియల్ ప్లాట్లు, శంషాబాద్–కొత్తూరు ప్రాంతంలో నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి, శంకర్‌పల్లి మోకిలాలో శ్రీవారి మెడోస్‌లో 300 చదరపు గజాల విల్లా, కొడంగల్, కిష్టాపూర్, పసుమాములలో ఐదు ప్లాట్లు, కొండాపూర్ మజీద్‌బండలో నాలుగు అంతస్తుల భవనం ఉన్నట్లు గుర్తించారు.
అలాగే నాలుగు కార్లు, రూ.4 లక్షల నగదు, రూ.45 లక్షల బ్యాంకు బ్యాలెన్స్, 1,440 గ్రాముల బంగారు ఆభరణాలు, సుమారు 12.5 కిలోల వెండి ఆభరణాలు, రూ.10 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు కూడా గుర్తించినట్లు ఏసీబీ వెల్లడించింది. గత 30 ఏళ్లుగా హెచ్ఎండీఏలో వివిధ హోదాల్లో పనిచేసిన రవీందర్, ఏడాది క్రితం చీఫ్ ఇంజనీర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆయన హయాంలోనే ఎలివేటెడ్ కారిడార్ల టెండర్ల ప్రక్రియ, ఔటర్ రింగ్ రోడ్ లీజు వంటి కీలక ప్రాజెక్టులు నిర్వహించబడినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుల ద్వారా అక్రమంగా భారీ ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అనుమానిస్తోంది. ఈ వ్యవహారంపై ఏసీబీ అధికారులు మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆస్తుల మూలాలు, ఆర్థిక లావాదేవీలు, ఇతర సంబంధిత అంశాలపై విచారణ చేపడుతున్నారు.

