Deputy CM Pawan Kalyan: కాకినాడ వేదికగా జరిగిన చారిత్రాత్మక ఒప్పందం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు కొత్త దిశ చూపుతోందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. దేశంలోనే కాకినాడను ఈ కీలక ప్రాజెక్టు కోసం ఎంపిక చేయడం ఎంతో ఆనందకరమని ఆయన పేర్కొన్నారు. కాకినాడలో ఏర్పాటు చేయనున్న ప్రపంచంలోనే అతి పెద్ద గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత.. గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబుతో కలిసి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శంకుస్థాపన చేశారు.. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, గత ప్రభుత్వ కాలంలో పారిశ్రామిక వేత్తలు ఎదుర్కొన్న ఇబ్బందులు అందరికీ తెలిసిన విషయమేనన్నారు. ముఖ్యంగా విద్యుత్ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టేశారని విమర్శించారు. ఆ పరిస్థితుల వల్ల పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్ వైపు రావడానికి భయపడ్డారని చెప్పారు.
Read Also: TDP vs Jana Sena Clash: టీడీపీ వర్సెస్ జనసేన.. కొట్టుకున్న నేతలు..!
ఇప్పుడా పరిస్థితి మారిందని, గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ దేశానికి మార్గదర్శకంగా నిలవాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. గ్రీన్ ఎనర్జీకి ఏపీ ప్రధాన ఉత్పత్తి కేంద్రంగా మారాలని తాము కృషి చేస్తున్నామని తెలిపార పవన్ కల్యాణ్.. చారిత్రాత్మక ఒప్పందానికి ఆంధ్రప్రదేశ్ వేదిక కావడం గర్వకారణమని, ముఖ్యంగా కాకినాడను ఎంపిక చేయడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని పవన్ అన్నారు. రాజకీయ పార్టీలు మారవచ్చని, కానీ ప్రభుత్వం శాశ్వతమని వ్యాఖ్యానించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. సుమారు 14 సంవత్సరాల క్రితం అనిల్ తపనతో గ్రీన్‌కో కంపెనీని ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడం జరిగిందని గుర్తు చేశారు. తాను పుట్టి పెరిగిన కాకినాడ కోసం అనిల్ ఎంతో చేస్తున్నారని ప్రశంసించారు. ప్రతి వ్యక్తి పెద్ద కలలు కనాలని, ఆ కలలే అభివృద్ధికి పునాది అవుతాయని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఈ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఇది కాకినాడతో పాటు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కీలకంగా మారనుందని తెలిపారు. ఇక, భవిష్యత్తులో కాకినాడకు రూ.64 వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయని వెల్లడించారు.. కూటమి ప్రభుత్వం పరిశ్రమలకు పెద్దపీట వేస్తూ.. ముందకు సాగుతుందని పేర్కొన్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
