Site icon NTV Telugu

Zakir Naik: హిందువులు నన్ను ఎంతగానో ప్రేమిస్తారు.. ఇస్లామిక్‌ బోధకుడి కీలక వ్యాఖ్యలు

Zakir Naik

Zakir Naik

Zakir Naik: పరారీలో ఉన్న ఇస్లామిక్ బోధకుడు జకీర్ నాయక్‌ ఒమన్‌లో చేసిన ప్రసంగంలో హిందువుల గురించి ప్రస్తావించారు. భారతదేశంలోని మెజారిటీ హిందువులు తనను ఎంతగానో ప్రేమిస్తున్నారని, ఇది ఓటు బ్యాంకు కోసం సమస్యను సృష్టిస్తోందని అన్నారు. ఇస్లామిక్ పవిత్ర మాసమైన రంజాన్ ప్రారంభాన్ని కూడా సూచిస్తున్న నేపథ్యంలో ఒమన్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో మాట్లాడిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్య చేశారు. జకీర్ నాయక్ విద్వేషాన్ని వ్యాప్తి చేయడంతోపాటు మనీలాండరింగ్ కేసుల్లో కూడా ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఒమన్‌లో తన మొదటి ఉపన్యాసం ‘ఖురాన్ ఈజ్ ఎ గ్లోబల్ నెసెసిటీ’పై ప్రసంగించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

“సమస్య ఏమిటంటే భారతదేశంలోని మెజారిటీ హిందువులు నన్ను ప్రేమిస్తారు. నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారని, అది ఓటు బ్యాంకుకు ఇబ్బందిని సృష్టిస్తోందన్నారు. భారతదేశంలో నేను చర్చలు, సమావేశాలు చేసినప్పుడు వందలు, వేల మంది ప్రజలు, ముఖ్యంగా బీహార్, కిషన్‌గంజ్‌లలో 50 మిలియన్ల నుండి 100 మిలియన్ల మంది ఉంటారు. వీరిలో 20 శాతం మంది ముస్లిమేతరులే. ”అని జాకీర్ నాయక్ అన్నారు. ‘జకీర్ భాయ్ మీ రెండు గంటల ప్రసంగంలో నేర్చుకున్నది.. మా మతంలో 40 గంటలు విన్నా నేర్చుకోలేదు’ అని చెబుతుంటారు’’ అంటూ తన ప్రసంగాన్ని కొనసాగించారు. తన ప్రసంగాల్లో ఎలాంటి తప్పూ లేదని సిక్కు న్యాయమూర్తి గుర్తించినట్టు చెప్పారు. 2018లో ఈడీ జకీర్ నాయక్ ఆస్తులను సీజ్ చేయబోయింది. దీన్ని ఢిల్లీలోని పీఎంఎల్ఏ అప్పిలేట్ ట్రిబ్యునల్ జడ్జిగా ఉన్న మన్మోహన్ సింగ్ అడ్డుకున్న విషయాన్ని జకీర్ నాయక్ వివరించారు. నాయక్ ప్రసంగంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే ఒక్క ప్రసంగాన్ని అయినా చూపించండంటూ ప్రభుత్వ న్యాయవాదిని జడ్జి అడిగినట్టు చెప్పారు.

Read Also: PM Modi: బెంగళూరులో కొత్త మెట్రో లైన్‌ను ప్రారంభించిన ప్రధాని

జకీర్ నాయక్‌ను తిరిగి భారత్‌కు రప్పించి న్యాయపరమైన చర్యలు ఎదుర్కొనేలా చర్యలు తీసుకుంటామని విదేశాంగ శాఖ తాజాగా ప్రకటించింది. జకీర్ అబ్దుల్ కరీమ్ నాయక్ (57) 2016లో దేశం విడిచి పరారయ్యారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారంటూ ఆయన స్థాపించిన ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్‌ను కేంద్రం నిషేధించింది. బహిరంగ ప్రసంగాలు ఇవ్వకుండా జకీర్‌పై మలేషియా కూడా నిషేధం విధించింది. ఆయనకు చెందిన పీస్ టీవీ నెట్ వర్క్‌ను బంగ్లాదేశ్, కెనడా, శ్రీలంక, యూకే నిషేధించాయి.

ముఖ్యంగా, నవంబర్ 19, 2022, మంగళూరు ఆటో పేలుడు కేసులో ప్రధాన నిందితుడు మహ్మద్ షరీక్, ఇస్లామిక్ బోధకుడు జాకీర్ నాయక్ వీడియోలతో ప్రభావితమయ్యాడు. స్వీయ-రాడికలైజ్ అయ్యాడు. వాటిని ఇతర సహ నిందితులతో పంచుకున్నాడు. టెలిగ్రామ్, సిగ్నల్, వైర్, ఇన్‌స్టాగ్రామ్, ఎలిమెంట్ వంటి ఇతర ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా వాటిని షేర్ చేయడానికి ఉపయోగించే జకీర్ నాయక్, అతని హ్యాండ్లర్ల వీడియోలను కలిగి ఉన్న షరీక్ మొబైల్ ఫోన్‌ను కర్ణాటక పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నాయక్ ప్రసంగం 2016 ఢాకా బాంబు దాడిని ప్రేరేపించిందని నమ్ముతారు. ఈ దాడిలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈస్టర్ రోజున జరిగిన 2019 బాంబు దాడిలో 250 మంది మరణించారు.

Exit mobile version