YSRCP vs TDP: ప్రకాశం జిల్లా ఒంగోలులో పొలిటికల్ ఫైట్ తారాస్థాయికి చేరింది.. ఎన్నికల ప్రచార సమయంలో వైసీపీ, టీడీపీ శ్రేణులు పరస్పరం దాడులు చేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.. ఇరుపార్టీల ప్రధాన నేతలు మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రంగంలోకి దిగడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనలో ఇరువర్గాలకు చెందినవారికి గాయాలయ్యాయి.. ఒంగోలులోని సమత నగర్ లో ప్రారంభమైన ఈ గొడవ కాస్తా.. ఒంగోలు రిమ్స్ వరకు చేరింది..
సమత నగర్ ప్రచారం నిర్వహించారు వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు కావ్య రెడ్డి.. అయితే, ఆమె ప్రచారాన్ని ఓ అపార్ట్ మెంట్ లోని మహిళలు అడ్డుకున్నారు. అపార్ట్ మెంట్ వద్ద మహిళలకు వైసీపీ కార్యకర్తలకు మాటామాట పెరగటంతో గొడవకు దిగారు ఇరు పార్టీల శ్రేణులు.. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఇక, రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. ఈ ఘటనలో టీడీపీ, వైసీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలు అయ్యాయి.. టీడీపీ కార్యకర్తపై దాడికి పాల్పడ్డ వైసీపీ కార్యకర్తలను అరెస్టు చేయాలంటూ ఎస్పీ కార్యాలయం వద్దకు ఒంగోలు టీడీపీ ఎంపీ అభ్యర్ధి మాగుంట శ్రీనివాసులరెడ్డి, అసెంబ్లీ అభ్యర్ధి దామచర్ల జనార్దన్ ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది.
మరోవైపు ఘటన స్థలానికి వెళ్లిన మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి.. తమ కుటుంబ సభ్యులపై టీడీపీ నేతలు దాడికి ప్రయత్నించటంతోనే ఘటన జరిగిందని మండిపడ్డారు. ఇక, రిమ్స్ లో చికిత్స పొందుతున్న టీడీపీ, వైసీపీ కార్యకర్తలను పరామర్శించేందుకు వెళ్లారు బాలినేని, దామచర్ల.. ఇరు పార్టీల కార్యకర్తలు ఒకేసారి చేరుకోవడంతో నినాదాలతో హోరెత్తింది రిమ్స్.. క్యాజువాలిటీలో పలు అద్దాలు ధ్వంసం చేశారు.. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించాల్సి వచ్చింది.. చివరకు బాలినేని శ్రీనివాస్‌రెడ్డిని, దామచర్లను రిమ్స్ నుంచి పంపించి వేయటంతో వివాదం సద్దుమణిగింది.