ఏడుకొండలవాడి సన్నిధికి భక్తులు పోటెత్తుతున్నారు. పెరిగిన భక్తుల రద్దీతో తిరుమలలో దర్శనానికి ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ తిరుమల భక్తులతో పోటెత్తింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి వెలుపల క్యూ లైనులో వేచివున్నారు భక్తులు.. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 40 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 73,323 మంది భక్తులు దర్శించుకున్నారు. 41,041 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న హుండీ ద్వారా టీటీడీకి రూ.3.2 కోట్లు ఆదాయం లభించింది. మరోవైపు తిరుపతిలో వర్షాలు కుమ్మేస్తున్నాయి. దీంతో భక్తుల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. గత రాత్రి నుండి వాన పడుతోంది. చలి తీవ్రత బాగా పెరిగింది. ఈదురుగాలులు కూడా వీస్తున్నాయి.
Read Also: Thiefs Wandering: బాబోయ్ దొంగలు.. తాళాలు పగులగొట్టి దొంగతనాలు
వర్షాల ప్రభావంతో ఇవాళ నిర్వహించవలసిన కార్తీక వనభోజన కార్యక్రమాన్ని రద్దు చేసింది టీటీడీ.. వర్షం కారణంగా పార్వేటి మండపం వద్ద నిర్వహించవలసిన కార్యక్రమాన్ని రద్దు చేసింది టీటీడీ.. వైభవోత్సవ మండపంలో ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు అర్చకులు.. ఇవాళ శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేసింది టీటీడీ.
భద్రాద్రిలోనూ భక్తుల రద్దీ
కార్తీక మాసం ఆదివారం సెలవు దినం కావడంతో భద్రాద్రి రామయ్య సన్నిధిలో భక్తుల రద్దీ బాగా పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి భారీగా కదిలి వచ్చిన భక్తులతో కిటకిటలాడుతున్నాయి ఆలయ ప్రాంతాలు. ఆదివారం సందర్భంగా ప్రధాన ఆలయంలోని సీతారాములకు పంచామృతాలతో అభిషేకం బంగారు పుష్పాలతో అర్చన నిర్వహించారు. భక్తుల రద్దీ పెరగడంతో ప్రత్యేక దర్శనానికి ఒక గంట సమయం పడుతోంది. ఉచిత దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. భక్తులకు ఇబ్బందులు రాకుండా దేవస్థానం అధికారులు అన్ని చర్యలు చేపట్టారు.
Read Also: US Air Show: విన్యాసాలు చేస్తూ ఢీకొన్న 2 యుద్ధ విమానాలు.. ఆరుగురు మృతి