కలియుగ వైకుంఠం తిరుమలకు భక్తుల తాకిడి పెరిగింది. ఎంతగా పెరిగందంటే గతంలో ఎన్నడూ లేని విధంగా తిరుమలకు పోటెత్తుతున్నారు భక్తులు. ఆగస్ట్ మాసంలో శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య అక్షరాలా 22.22 లక్షల మంది. భక్తుల తాకిడి వల్ల హుండీ ద్వారా రూ.140.34 కోట్ల ఆదాయం టీటీడీకి లభించింది. కోటి 5 లక్షల లడ్డూల విక్రయాలు జరిగాయని టీటీడీ అధికారులు తెలిపారు. నెలరోజుల్లో భక్తులు భారీగానే స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు. మొత్తం 47.76 లక్షల మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. అలాగే తిరుమలకు వచ్చేవారు తలనీలాలు ఇస్తుంటారు. మొత్తం భక్తుల్లో తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 10.85 లక్షల మంది. అంటే తిరుమలకు వచ్చేవారిలో సగం మంది వరకూ తలనీలాలు సమర్పిస్తున్నారు. గతంలో ఈ సంఖ్య ఎక్కువగానే వుండేది.
Read Also: Medak Edupayala Temple: జల దిగ్బంధంలో ఏడుపాయల ఆలయం.. తాత్కాలికంగా మూసివేత
ఇదిలా వుంటే.. తాజాగా ఏడుకొండలపై పెరిగిన భక్తుల రద్దీ కొనసాగుతూనే వుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లన్నీ నిండిపోయాయి. రాంభగిచా అతిధి గృహాల వరకు క్యూ లైనులో వేచివున్నారు భక్తులు..సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తులు 64,292 మంది. తలనీలాలు సమర్పించిన భక్తులు 30,641 మంది. హుండీ ఆదాయం రూ.3.72 కోట్లుగా టీటీడీ తెలిపింది.
రాబోయేది బ్రహ్మోత్సవాల సమయం కాబట్టి మరింతగా భక్తులు స్వామివారి దర్శనానికి రానున్నారు. తిరుమలలో ఇవాళ పౌర్ణమి గరుడ సేవ నిర్వహించనున్నారు. శనివారం రాత్రి 7 గంటలకు గరుడ వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు మలయప్పస్వామి. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వారాంతం కావడంతో శని, ఆదివారాల్లో భక్తులు భారీగా తరలివస్తున్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో.. వసతి సౌకర్యం దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు భక్తులు. క్యూలెన్లలో అదనపు సౌకర్యాలు, వైద్యసదుపాయం అందిస్తున్నారు వైద్యాధికారులు. తొక్కిసలాటకు అవకాశం లేకుండా సెక్యూరిటీ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
Read Also: Ganesh Nimajjanam 2022 LIVE : ఎన్టీఆర్ మార్గ్ లో భారీగా నిలిచిన వినాయక విగ్రహాలు
తిరుమలలోని శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఇప్పటి వరకు 516 కోట్ల రూపాయల ఆదాయం లభించిందని ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. 1342 ఆలయాలను శ్రీవాణి ట్రస్ట్ నిధులుతో నిర్మిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఒక్కో ఆలయ నిర్మాణం కోసం 10 లక్షల రూపాయలు నిధులు కేటాయిస్తున్నాం అన్నారు ధర్మారెడ్డి. వెనుకబడిన వర్గాల వారికి అర్చకత్వంలో శిక్షణ ఇస్తాం అన్నారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా నిర్మిస్తున్న ఆలయాల ధూపధీప నైవేధ్యం కోసం టీటీడీ నిధులు కేటాయిస్తాం అన్నారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వెచ్చిస్తున్న నిధులుకు ఆడిటింగ్ చేసేలా వ్యవస్థ ఏర్పాటు చేస్తాం అని ఈవో వివరించారు.
