NTV Telugu Site icon

Heavy Rains: భాగ్యనగరంలో భారీ వర్షం.. గ్యాప్‌ లేకుండా దంచికొడుతోన్న వాన..

Hyderabad Rains

Hyderabad Rains

Heavy Rains: భాగ్యనగరంలో భారీ వర్షం కురుస్తోంది.. నిన్న రాత్రి నుంచి గ్యాప్‌ లేకుండా వాన దంచికొడుతూనే ఉంది.. వర్షం పడితే చాలు.. హైదరాబాద్‌ అస్తవ్యస్తంగా మారిపోతుంటుంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు జీహెచ్‌ఎంసీ, పోలీసు ఉన్నతాధికారులు.. హైదరాబాద్‌లో రాత్రి నుంచి ఉదయం 5.30 గంటల వరకు 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది.. ఇక, తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు.. కొన్ని జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది.. రాష్ట్రంలో రెడ్‌ అలర్ట్‌ కొనసాగుతోంది.. తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న అతి భారీ వర్షాలు.. నిన్న ఉదయం 8:30 గంటల నుంచి ఈరోజు ఉదయం 5 గంటల వరకు రికార్డు స్థాయిలో వర్షాలు నమోదు అయ్యాయి.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అత్యధికంగా 434 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా.. రాష్ట్రవ్యాప్తంగా 10కి పైగా ప్రాంతాల్లో 300 మిల్లీ మీటర్ల నుంచి 500 మిల్లీ మీటర్ల వర్షపాతం.. 50 పైగా ప్రాంతాల్లో 200 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది.

ఇక, వర్షం నీరు వెళ్లేందుకు దారి లేక.. కాలనీలకు కాలనీలే నీట మునిగిపోయాయి.. ఇళ్లల్లోకి నీరు చేరి జనాలను ఇబ్బందులపాలు జేస్తుంది. రోడ్లపైకి నీరు చేరి వాహనదారులు ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తుంటారు. ఏరియా ఏదైనా.. వర్షం పడితే రోడ్డు కనిపించకుండా పోతుంది. ఎక్కడ గుంత ఉందో.. ఎక్కడ నాలా ఉందో అర్థంకాక ప్రాణాలమీదకు వస్తుంటుంది. అయితే, విశ్వనగరం దిశగా హైదరాబాద్ అభివృద్ధి చెందుతోంది. పెద్ద పెద్ద భవనాలు.. దిగ్గజ కంపెనీలతో ప్రపంచస్థాయి నగరాలతో పోటీ పడుతోంది. కానీ.. రోజు రోజుకు విస్తరిస్తున్న నగరానికి అనుగుణంగా డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం సమస్యకు అసలు కారణంగా కనిపిస్తోంది. హైదరాబాద్ విస్తరించినా.. నిజాం కాలంనాటి డ్రైనేజీ వ్యవస్థ ప్రస్తుత పరిస్థితిని తట్టుకోలేకపోతోంది. చిన్న వర్షానికే చిత్తడిగా మారిపోయే పరిస్థితికి కారణమవుతోంది. మూసీ కాలువల పరిస్థితి సరిగ్గాలేకపోవడం.. అర్బన్ డెవలప్‌మెంట్‌ ప్లానింగ్, ఫ్లడ్ మేనేజ్‌మెంట్ సిస్టం సరిగా లేకపోవడంతో.. సిటీ స్లోగా రెడ్ జోన్‌లోకి వెళ్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

హైదరాబాద్‌లో వరదల ప్రభావంపై చాలాసార్లు నిపుణులు అధ్యయనం చేశారు. ప్రభుత్వానికి నివేదికలు కూడా ఇచ్చారు. కానీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా సమస్య ఉంది. 2020లో వచ్చిన వరదలకు చాలా కాలనీల్లో బోట్లు వేసుకుని తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని కాలనీలైతే రోజులపాటు నీటిలోనే ఉన్నాయి. మూడేళ్లైంది కానీ సీన్‌ మారలేదు. సిటీ కాంక్రీట్ జంగిల్‌గా మారడంతో.. భూమిలోకి నీరు ఇంకే అవకాశం లేకుండా పోయింది. ఢిల్లీ, చెన్నై, బెంగళూరులాంటి మెట్రో సిటీస్‌లాగే భూమిని వదిలేయకుండా నిర్మాణాలు చేపట్టడం కూడా వర్షాలు పడిన సమయంలో వరదలకు కారణమవుతోంది. వర్షాకాలం సీజన్ ప్రారంభం కావడానికి ఓ నెల రెండు నెలల ముందు నుంచి నాళాల పూడిక పనులు చేపట్టడం హైదరాబాద్‌లో ఆనవాయితి. కానీ ప్రతీ నెలా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తే వరద ప్రభావం కొంతమేర తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా.. ఇప్పుడు కట్టే నిర్మాణాలను, కాలనీలను సరైన ప్లానింగ్‌తో కట్టాలని సూచిస్తున్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలంటున్నారు.

వరద సమస్య తలెత్తకుండా చూసే బాధ్యత ప్రభుత్వాలు, అధికారులది మాత్రమే కాదు. ప్రజలు కూడా బాధ్యతతో వ్యవహరించాల్సి ఉంటుంది. ఎందుకంటే.. నాలాల పూడికతీత సమయంలో… బయటపడే వస్తువులు చూస్తే.. ఎంత నిర్లక్ష్యంగా ఉన్నామో అర్థమవుతుంది. వరద సమస్యతో చిన్న వర్షం పడితే ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అవుతోంది. పబ్లిక్ రవాణా వ్యవస్థను ఉపయోగిస్తే.. వర్షాకాలంలో కాస్త ట్రాఫిక్‌ కంట్రోల్‌లో ఉంటుందని పోలీసులు చెప్పే మాట. ఇలా కాకుంటే పొల్యూషన్ కంట్రోల్ చేసేందుకు ఢిల్లీలోలాగా సరి బేసీ విధానాన్ని అమలు చేస్తే కొంతలో కొంత అయినా ట్రాఫిక్ నియంత్రించే అవకాశం ఉంటుందని ట్రాఫిక్ పోలీసులంటున్నారు.