Site icon NTV Telugu

Afghanistan: ఆప్ఘనిస్థాన్‌ ను ముంచెత్తిన వర్షాలు..50 మంది మృత్యువాత

Afghanistanweather

Afghanistanweather

ఆప్ఘనిస్థాన్‌లో తీవ్ర విషాదం నెలకొంది. భారీ వర్షాలు ఆ దేశాన్ని ముంచెత్తుతున్నాయి. చాలా కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగులుస్తున్నాయి. గత నెలలో కురిసిన వర్షాల వల్ల 70 మంది మృతి చెందగా.. ఆ విషాదం మరువక ముందే మరో సారి భారీ వర్షాలు కురిశాయి. తాజాగా ఉత్తర ప్రావిన్స్ బగ్లాన్‌లో భారీ వర్షాల కారణంగా 50 మంది మరణించారు. సుమారు 100 మందికి పైగా గాయపడ్డారు. ఆస్తి నష్టం భారీగా సంభవించింది. అకస్మాత్తుగా వచ్చిన వర్షాల కారణంగా పెద్ద ఎత్తున వరదలు సంభవించాయని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అబ్దుల్ మతీన్ ఖనీ వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. వరదలతో ఐదు జిల్లాలు ప్రభావితమయ్యాయని.. 150 మందికి పైగా ప్రజలు చిక్కుకుపోయారని వారిని రక్షించేదుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

READ MORE: Sajjala Ramakrishna Reddy: ల్యాండ్ టైటిల్ యాక్ట్‌పై తప్పుడు ప్రచారం.. ఆ బిల్లుకు టీడీపీ మద్దతిచ్చింది..!

ఉన్నట్టుండి భారీ వర్షాలు రావడంతో వివిధ జిల్లాల్లోని ఇళ్లు దెబ్బతిన్నాయని, భారీగా ఆస్తి నష్టం జరిగిందని బాగ్లాన్‌లోని ప్రకృతి విపత్తు నిర్వహణ ప్రాంతీయ డైరెక్టర్ ఎదయతుల్లా హమ్దార్ద్ చెప్పారు. రాజధాని కాబూల్‌ను కూడా ఆకస్మిక వరదలు ముంచెత్తాయని ప్రకృతి విపత్తు నిర్వహణ రాష్ట్ర మంత్రిత్వ శాఖ తాలిబాన్ ప్రతినిధి అబ్దుల్లా జనన్ సైక్ తెలిపారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్‌పైనే ప్రధానంగా దృష్టి సారించామని, ప్రాణనష్టం, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని వెల్లడించారు. కాగా, గత నెలలో భారీ వర్షాలు, ఆకస్మిక వరదల కారణంగా 70 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఆ వరదల్లో దాదాపు 2,000 ఇళ్లు, 3 మసీదులు, 4 పాఠశాలలు దెబ్బతిన్నాయి. ఈ సారి కూడా అలాగే జరిగే అవకాశం లేకపోలేదు. ఇప్పటి వరకు కేవలం 50 మంది మాత్రమే మృతిచెందినట్లుగా ప్రకటించినా.. ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

Exit mobile version