Site icon NTV Telugu

Rain in Adilabad : ఆదిలాబాద్‌లో భారీ వర్షాలు.. పొంగుతున్న వాగులు, వంకలు..

Adilabad Rains

Adilabad Rains

Heavy rains in adilabad district

కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో సోమవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురియడంతో వాగులు పొంగిపొర్లుతూ రవాణా వ్యవస్థపై ప్రభావం చూపింది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 49.6 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. బెజ్జూరు మండలంలో అత్యధికంగా 96 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జైనూర్ మండలంలో అత్యల్పంగా 24 మి.మీ నమోదైంది. జూన్ 1 నుంచి ఆగస్టు 8 వరకు 587 మి.మీ సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా జిల్లా వ్యాప్తంగా 1,232 మి.మీలుగా వర్షపాతం నమోదైంది. 110 శాతం అధికంగా నమోదైందని అధికారులు పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లాలో సగటు వర్షపాతం 27.9 మి.మీ నమోదు కాగా.. హాజీపూర్ మండలంలో అత్యధికంగా 44.9 మి.మీ, జైపూర్ మండలంలో 38.5 మి.మీ వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం 598 మి.మీ.తో పోల్చితే జిల్లాలో1,123 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇది 88 శాతం ఎక్కవని తెలిపారు అధికారులు. కాగా, ఆదిలాబాద్ జిల్లాలో సగటున 25.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిర్మల్ జిల్లాలో 19.7 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది.

భారీ వర్షాలకు కొండ వాగులు ఉప్పొంగి ప్రవహించాయి. దిగువ స్థాయి వంతెనలు, రహదారులను వరదలు ముంచెత్తాయి. కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాల్లోని మారుమూల ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో బెజ్జూర్‌, దహెగావ్‌, పెంచికల్‌పేట్‌ మండలాల్లోని అంతర్గత గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమన్నారు. కొమురం భీమ్ ప్రాజెక్టుకు 13,173 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చింది. రిజర్వాయర్ పూర్తి స్థాయి 243 మీటర్లకు గాను నీటిమట్టం 238.9 మీటర్లకు చేరుకుంది. 1.50 మీటర్ల ఎత్తు వరకు మూడు గేట్లను ఎత్తి మిగులు జలాలను దిగువకు విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా అనేక ఇతర నీటిపారుదల ప్రాజెక్టులకు ఇన్‌ఫ్లోలు వచ్చాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పత్తి, వరి, సోయా, ఎర్రజొన్నలు దెబ్బతిన్నాయని రైతులు తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు పంట నష్టాన్ని అంచనా వేయాలని కోరారు. ఈ వ్యవసాయ సీజన్‌లో జులై, ఆగస్టులో కురిసిన భారీ వర్షాల వల్ల తమకు తీవ్ర నష్టం వాటిల్లిందని వాపోయారు.

 

Exit mobile version