Hyderabad Rains: తెలంగాణా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.. రెండు గంటలపాటు ఏకధాటిగా కురిసిన వర్షంతో నగరం నానిపోయింది. రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లో ఎక్కడికక్కడ నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు నగరవాసులు.. నిన్న సాయంత్రం కురిసిన వర్షాలకు వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు..హఠాత్తుగా దంచి కొట్టిన వానతో భాగ్యనగరం చివురుటాకులా వణికిపోయింది. ఓవైపు ఎల్లో అలర్ట్ కొనసాగుతుండగా.. నగరం నలుమూలలా రెండు గంటలపాటు కుంభవృష్టి కురిసింది. ఉరుములు మెరుపులతో కురిసిన వర్షంతో హైదరాబాద్ అతలాకుతలం అయ్యింది. భాగ్యనగర వీధులు మహాసంద్రాన్ని తలపించాయి..
నగరంలోని రోడ్లు అన్ని జలమయం అయ్యాయి.. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న సెక్రటేరియట్ ప్రాంతంలోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు ఎటు చూసినా నీళ్లే కనిపించాయి. అడుగు తీసి అడుగువేయాలంటే హడలిపోయారు జనం. ఎక్కడ ఏ మ్యాన్ హోల్ ఉంటుందోనని గజగజ వణికిపోయారు. అందులోనూ.. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. భారీ వర్షంతో ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. వాహనదారులు భాధలు చెప్పలేనివి.. అనేక ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి..
భారీ వర్షంతో హైదరాబాద్ యాకత్‌పురాలో ఓ పాతభవనం కూలిపోయింది. లంగర్‌హౌజ్‌లో పిడుగుపాటుతో 400 ఏళ్ల కుతుబ్‌షాహీ మసీద్‌కు చెందిన ఓ గోపురం కూలిపోగా.. మిగతా ప్రాంతంలో పగుళ్లు వచ్చాయి. నాంపల్లి యుసుఫిన్ దర్గాలో మోకాళ్ల లోతులో నీరు నిలిచిపోయింది. అత్తాపూర్‌లో పిడుగుపాటుతో ఓ వ్యక్తి అదృష్టవశాత్తు ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఇక.. మూసీ పరివాహక ప్రాంతాల్లోని కొన్ని లోతట్టు ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది.. రెండు గంటలు కురిసిన వర్షాలకు ప్రాంతమంతా సముద్రంగా మారాయి.. ఇప్పటికి వర్షం తగ్గలేదు పడుతూనే ఉంది..మరో మూడు రోజులు కురవనున్న భారీ వర్షాలకు జనాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు..