Heavy Rains: వాయవ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. కళింగపట్నంకి తూర్పున 280 కి.మీ., గోపాల్‌పూర్‌కి తూర్పు-ఆగ్నేయంగా 230 కి.మీ.,పారాదీప్ కి దక్షిణ-ఆగ్నేయంగా 260 కి.మీ , దిఘాకి దక్షిణంగా 390 కి.మీ దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. రేపు సాయంత్రం లేదా రాత్రి పూరీ- దిఘాల మధ్య వాయుగుండం తీరాన్ని దాటే అవకాశం ఉంది. రానున్న రెండు రోజులలో కోస్తా జిల్లాలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ ముఖ్య అధికారి కేవీఎస్ శ్రీనివాస్ వెల్లడించారు.
Read Also: Breaking News: ఏపీలో భారీ వర్షాలు కారణంగా 45 మంది మృతి.. ఆ జిల్లాలో ఏకంగా 35 మంది
శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. విశాఖ, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, యానాంలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదైయ్యే (ఫ్లాష్ ఫ్లడ్ ) అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు గరిష్టంగా 70 కిలోమీటర్లు బలమైన గాలులు వీచే అవకాశం ఉందని కేవీఎస్ శ్రీనివాస్ తెలిపారు. రానున్న మూడు రోజులు మత్య్సకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. కళింగపట్నం, భీమిని పట్నం, గంగవరం, కాకినాడ పోర్టులలో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గడిచిన 24 గంటలలో అత్యధికంగా విజయనగరంలో కళింగ పట్నం 11 సెంటిమిటర్ల వర్షపాతం నమోదైంది.
ఉమ్మడి విశాఖలో కుండపోత వర్షం
ఉమ్మడి విశాఖలో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. విశాఖలో కుండపోతగా వర్షం కురుస్తోంది. భారీ వర్షాలు కురుస్తుండడంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పాత బిల్డింగ్‌ల వద్ద ఉండొద్దని అధికారుల సూచనలు చేశారు. పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురువనున్నట్లు వాతావరణ విభాగం సూచించింది. రానున్న 24 గంటల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.