NTV Telugu Site icon

Hyderabad Rains: హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. చెరువును తలపిస్తున్న రోడ్లు! బయటకు రావొద్దని జీహెచ్‌ఎంసీ హెచ్చరిక

Rains

Rains

Heavy Rain Falls in Hyderabad: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌ నగరంలోని పలుచోట్ల ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. సోమవారం నుంచే వర్షం పడుతున్నా.. మంగళవారం తెల్లవారుజాము 2-3 గంటల నుంచి భారీ వర్షం పడుతోంది. వర్షం ధాటికి నగరంలోని రోడ్లు జలమయమవ్వడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రోడ్లపై వర్షపు నీరు పరుగులు పెడుతుండడంతో ద్విచక్ర వాహనదారులు ముందుకు వెళ్లేందుకు వెనకడుగువేస్తున్నారు.

కాటేదాన్, నార్సింగీ, మణికొండ, గండిపేట, బండ్లగూడ, కూకట్‌పల్లి, హైదర్‌నగర్‌, నిజాంపేట్‌, ప్రగతినగర్‌, కేపీహెచ్‌బీ కాలనీ, అమీర్‌పేట, సోమాజీగూడ, ఖైరతాబాద్‌, నాంపల్లి, మలక్‌పేట్‌, సైదాబాద్‌, పాతబస్తీ, ఎల్బీనగర్‌, సాగర్‌రింగ్‌ రోడ్‌, హస్తినాపురం, ఉప్పల్, సికింద్రాబాద్‌, గాంధీ ఆసుపత్రి, బేగంపేట, మారేడుపల్లి, పారడైజ్‌, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, అల్వాల్‌, బొల్లారం ప్రాంతాల్లో వర్షం జోరుగా కురుస్తోంది. పలు చోట్ల సోమవారం రాత్రి నుంచి వర్షం పడుతూనే ఉంది. గత రెండు గంటలుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది.

రాజేంద్రనగర్ ఉప్పర్‌పల్లి 191 పిల్లర్ వద్ద భారీగా వరద నీరు చేరింది. రాజేంద్రనగర్‌కు వెళ్లే రహదారి చెరువును తలపిస్తోంది. దాంతో నీటిలో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు వెళ్లే వాహనాలు ముందుకు కదలని పరిస్థితి నెలకొంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు సికింద్రాబాద్‌లోని పలు ప్రాంతాలు జలమయ్యాయి. రోడ్లపై నుంచి వర్షపు నీరు డ్రైనేజీతో పాటు ప్రవహిస్తుంది. ప్రధాన రహదారి జలమయమై వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

Also Read: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

ఏకధాటిగా వర్షం కురుస్తున్నందున ఇళ్లలోకి నీరు చేరుతుందేమో అన్న భయంలో లోతట్టు ప్రాంతాల వాసులు ఉన్నారు. వచ్చే గంటలో భారీగా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. పది సెంటి మీటర్ల వర్షం పడే అవకాశం ఉందట. ప్రస్తుతం 8 నుంచి 10 సెంటీమీటర్ల వరకు వర్షం కురుస్తోంది. భారీ వర్షం నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రజల్ని అప్రమత్తం చేశారు. అవసరమైతే తప్ప బయటికి రావొద్దని సూచించారు.

Show comments