Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!

Heart Disease

Heart Disease

Heart Disease: వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. అలసట, నిద్రలేమి, గురకలు, లైంగిక ఆరోగ్య సమస్యలను చాలా మంది పురుషులు సాధారణ వృద్ధాప్య లక్షణాలుగా భావించి పట్టించుకోరు. అయితే ఇవి కేవలం సాధారణ సమస్యలు కాకుండా.. భవిష్యత్తులో గుండె సంబంధించిన తీవ్రమైన వ్యాధులకు ముందస్తు హెచ్చరికలుగా అవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌:
పురుషుల్లో కనిపించే ముఖ్యమైన హెచ్చరిక సంకేతాల్లో ఇరెక్టైల్ డిస్‌ఫంక్షన్ (ED) ఒకటి. చాలామంది దీనిని కేవలం లైంగిక సమస్యగా మాత్రమే భావిస్తారు. అయితే నిపుణుల ప్రకారం.. పురుషాంగానికి రక్తాన్ని సరఫరా చేసే ధమనులు శరీరంలో అత్యంత సన్నని రక్తనాళాల్లో ఒకటిగా ఉంటాయి. వీటిలో రక్తప్రసరణ తగ్గినా లేదా బ్లాకేజీలు ఏర్పడినా మొదట ప్రభావం లైంగిక ఆరోగ్యంపైనే కనిపిస్తుంది. అందుకే ఇరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అనేది గుండె జబ్బులు, ఛాతినొప్పి లేదా గుండెపోటుకు ముందుగానే వచ్చే హెచ్చరిక కావచ్చని చెబుతున్నారు.

×
×
Ad

టెస్టోస్టెరాన్ స్థాయిలు తగ్గడం:
తక్కువ టెస్టోస్టెరాన్ స్థాయిలను చాలా మంది వయసు పెరగడం వల్లే అని భావిస్తారు. కానీ దీనికి పొట్ట చుట్టూ అధిక కొవ్వు పేరుకుపోవడం, సరైన నిద్ర లేకపోవడం, శారీరక శ్రమ తగ్గిపోవడం వంటి కారణాలు ఉండవచ్చని నిపుణులు అంటున్నారు. జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా ఈ సమస్యను కొంతవరకు నియంత్రించవచ్చని.. మందులు లేదా సప్లిమెంట్లపై ఆధారపడే ముందు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం అవసరమని పేర్కొన్నారు.

గుండె ఆరోగ్యం:
మహిళలతో పోలిస్తే పురుషుల్లో గుండె సంబంధిత వ్యాధులు ముందుగానే వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మహిళలకు మెనోపాజ్ వరకు ఈస్ట్రోజన్ హార్మోన్ గుండెకు కొంత రక్షణ కల్పిస్తుంది. అయితే పురుషులకు అలాంటి సహజ రక్షణ ఉండదు. అందువల్ల గుండె వ్యాధులు మహిళల కంటే దాదాపు పదేళ్ల ముందే పురుషుల్లో అభివృద్ధి చెందవచ్చని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి 60 ఏళ్ల తర్వాత కాకుండా 30-40 ఏళ్ల వయసు నుంచే గుండె ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచిస్తున్నారు.

ఎక్కువగా గురక పెట్టడం:
రాత్రి సమయంలో బిగ్గరగా గురక పెట్టడం, తరచూ నిద్ర మధ్యలో మేల్కొనడం లేదా సరిపడా నిద్రపోయినా అలసటగా అనిపించడం వంటి లక్షణాలు స్లీప్ అప్నియా సంకేతాలు కావచ్చు. ఈ సమస్య వల్ల అధిక రక్తపోటు, గుండె స్పందనలో అసాధారణతలు, గుండెపై అదనపు ఒత్తిడి ఏర్పడే ప్రమాదం ఉంది. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే.. ఈ సమస్యతో బాధపడుతున్న చాలామందికి వారు స్లీప్ అప్నియాతో బాధపడుతున్నామనే విషయం కూడా తెలియకపోవడం.

ఎవరైనా సరే.. తమ ఆరోగ్యానికి సంబంధించిన ఈ సంకేతాలను సాధారణ సమస్యలుగా తీసుకోకుండా వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఇరెక్టైల్ డిస్‌ఫంక్షన్, తక్కువ టెస్టోస్టెరాన్, అధిక గురక, నిరంతర అలసట వంటి లక్షణాలు కనిపిస్తే గుండె ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా భవిష్యత్తులో వచ్చే ప్రమాదాలను తగ్గించుకోవచ్చు.