Site icon NTV Telugu

IT Employees: ప్రమాదంలో ఐటీ ఉద్యోగుల ఆరోగ్యం.. సర్వేలో ఆసక్తికర విషయాలు..!

It Employees

It Employees

IT Employees: ఐటీ ఉద్యోగం అంటే.. హాయ్ ఫై లైఫ్. అంతేకాదండోయ్ వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు. అయితే అది నాణేనికి ఒకవైపు మాత్రమే. పని ఒత్తిడి, ఎక్కువ గంటలు కూర్చోవడం, ఆహారపు అలవాట్లు నాణేనికి మరో వైపు. దీంతో వారు అనారోగ్యానికి గురవుతున్నారు. చాలా మంది ఐటీ ఉద్యోగులు తమ విభిన్న జీవనశైలి వల్ల రకరకాల వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ విషయాన్ని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్‌ఐఎన్) ఒక నివేదికలో వెల్లడించింది. తాజాగా హైదరాబాద్‌లోని ప్రముఖ ఐటీ సంస్థల్లో పనిచేస్తున్న 183 మంది ఐటీ ఉద్యోగులపై అధ్యయనం చేశారు. వారి పని విధానం, శారీరక శ్రమ, ఆహారపు అలవాట్లు తదితర అనేక అంశాలపై అధ్యయనం చేశారు. ఇంటర్నేషనల్ పీర్ రివ్యూడ్ జర్నల్ ‘న్యూట్రియంట్స్’ ఆగస్టు 2023 సంచికలో ఈ వివరాలు ప్రచురించబడ్డాయి. NIN శాస్త్రవేత్తల బృందం ఈ అంశంపై మరింత లోతైన పరిశోధన చేసింది. ఈ అధ్యయనం ప్రకారం, 46 శాతం మంది ఐటీ ఉద్యోగులకు జీవనశైలి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ప్రతి 10 మంది ఐటీ ఉద్యోగుల్లో ముగ్గురు అధిక రక్తపోటు (బీపీ), ఊబకాయం (అధిక బరువు), మధుమేహం (షుగర్) వంటి వ్యాధులతో బాధపడుతున్నారని పేర్కొంది.

Read also: CM KCR: నేడు సూర్యాపేటకు సీఎం.. పార్టీ తోరణాలతో గులాబీమయంగా జిల్లా కేంద్రం..

ఐటీ ఉద్యోగుల్లో చాలా మంది బెల్లీ ఫ్యాట్‌తో బాధపడుతున్నట్లు తేలింది. పురుషుల్లో 90 సెంటీమీటర్లు, మహిళల్లో 80 సెంటీమీటర్ల కంటే ఎక్కువ చుట్టుకొలత ఉంటే జీవనశైలి వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని ఎన్ఐఎన్ హెచ్చరించింది. ఐటీ ఉద్యోగులు సగటున 8 గంటలకు పైగా కూర్చొని గడుపుతున్నారని సర్వే వెల్లడించింది. ఐటీ ఉద్యోగుల్లో 78 శాతం మంది వ్యాయామం చేయడం లేదని, కేవలం 22 శాతం మంది ఉద్యోగులు మాత్రమే వారానికి 150 నిమిషాల పాటు వ్యాయామం చేస్తున్నారని పేర్కొంది. 26 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు వారు కూడా అధిక బరువు, బీపీ, షుగర్‌ బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. తరచుగా జంక్ ఫుడ్ తినడం, ఆహారంలో పండ్లు, కూరగాయలు తక్కువగా తీసుకోవడం, సమయానికి ఆహారం తీసుకోకపోవడం, భోజనం మానేయడం వంటి అలవాట్ల వల్ల ఐటీ ఉద్యోగులు దీర్ఘకాలంలో వ్యాధుల బారిన పడుతున్నారని తెలిపారు. 30 ఏళ్లు దాటిన సీనియర్ ఉద్యోగుల్లో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుందన్నారు. వాటిలో జీవనశైలి ప్రమాద కారకాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఐటీ ఉద్యోగుల్లో 66 శాతం మంది ఊబకాయులు, 44 శాతం మంది అధిక బరువు, 4 శాతం మంది మధుమేహంతో బాధపడుతున్నారని తేలింది. మంచి ఆహారపు అలవాట్లు, వ్యాయామాలు, తగినంత విశ్రాంతి తీసుకోవడం ద్వారా వ్యాధుల ముప్పు నుంచి తప్పించుకోవచ్చని తెలిపారు. రెగ్యులర్ హెల్త్ చెకప్‌లతో పాటు, ఆహారపు అలవాట్లు మరియు జీవనశైలిని మార్చుకోవడం చాలా ముఖ్యం.
Tirumala Tickets: భక్తులకు టీటీడీ శుభవార్త.. వసతి గదుల టికెట్లు 25న విడుదల..!

Exit mobile version