Sky Walk: హైదరాబాద్ ట్రాఫిక్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రోడ్డు దాటడం అంటే సాహసించాల్సిందే. ఇప్పటికే ఎంతో మంది రోడ్డు దాటుతూ తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు. రోజు నగరంలో ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు దాటుతున్న పాదాచారులు ప్రమాదాలకు గురవుతూనే ఉన్నారు. వీటిని కట్టడిచేసేందుకు ప్రభుత్వం, హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ(HMDA) కొత్త మార్గాలను అన్వేషించింది. నగరంలో రద్దీగా ఉన్న ప్రాంతాల్లో ఫ్లై ఓవర్ల మాదిరిగా స్కై వాకులను నిర్మించాలని నిర్ణయించింది. అనుకున్నదే తడవుగా నిర్మాణం చేపట్టింది.
రద్దీ ఎక్కువగా ఉండే మెహిదీపట్నంలో నిర్మాణమవుతున్న స్కైవాక్ ఈ ఏడాది మే నెలలో అందుబాటులోకి రానుంది. 11 ఎలివేటర్లతో 390 మీటర్ల పొడవుతో ఈ స్కైవాక్ నిర్మిస్తున్నారు. హెచ్ ఎండీఏ రూ.32.97 కోట్లతో ఈ స్కైవాక్ నిర్మిస్తోంది. మొత్తం 390 మీటర్ల పొడవులో మెహిదీపట్నం బస్టాండ్ నుంచి డిఫెన్స్ సరిహద్దు వరకు 50 మీటర్లు, మెహిదీపట్నం నుంచి రైతు బజార్, ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్ వరకు ఇంటర్మీడియట్ టన్నెల్ వాక్ 160 మీటర్లు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
Read Also: Rythu Bandhu : రైతులకు గుడ్ న్యూస్.. మరో 550కోట్లు విడుదల చేసిన సర్కార్
మెహిదీపట్నం నుంచి మల్లేపల్లి రోడ్డు వరకు 180 మీటర్లు పొడవునా వాక్ వే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. క్లియరెన్స్ ఎత్తు 6.15 మీటర్లుగా ఉండగా.. వెడల్పు నాలుగు నుంచి ఐదు మీటర్లతో నిర్మిస్తున్నారు. రైతు బజార్, డిఫెన్స్ కాంపౌండ్ వాల్, మెహిదీపట్నం బస్ బే ఏరియా, అసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్, గుడిమల్కారూర్ సమీపంలో రేమండ్ షోరూమ్ దగ్గర ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు పెడుతున్నారు. స్కైవాక్‌లో కాఫీ షాప్‌లు, స్నాక్స్, ఇతర షాపుల కోసం స్థలాన్ని కేటాయించనున్నారు. అలాగే ఎల్‌ఈడీ స్ట్రిప్ లైట్లను ఏర్పాటు చేయనున్నారు. స్కైవాక్ వల్ల పాదచారులకు మరింత భద్రత ఉంటుందని అధికారులు చెబుతున్నారు. PV నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వేకి ఆనుకుని ఈ స్కైవాక్‌ను నిర్మిస్తున్నారు.
అలాగే ఉప్పల్ జంక్షన్ వద్ద కూడా స్కైవాక్ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. రూ.35 కోట్ల వ్యయంతో ఇది రూపుదిద్దుకుంటుండగా.. త్వరలోనే ఇది కూడా అందుబాటులోకి వచ్చే అవకాశముందని తెలుస్తోంది. 660 మీటర్ల స్కైవాక్ ఉప్పల్ జంక్షన్ నాలుగు వైపులా కలుపుతుంది. అంతేకాకుండా మెట్రో స్టేషన్‌తో కాంకోర్స్ లెవల్, బస్-స్టాప్‌లు, వాణిజ్య సంస్థలతో అనుసంధానించబడి ఉంది. స్కైవాక్‌లో ఆరు ప్రవేశ, నిష్క్రమణ పాయింట్లు ఉన్నాయి.
నాగోల్ రోడ్ వైపు మెట్రో స్టేషన్, రామాంతపూర్ రోడ్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) థీమ్ పార్క్, జీహెచ్‌ఎంసీ కార్యాలయం సమీపంలోని వరంగల్ బస్ స్టాప్, ఉప్పల్ పోలీస్ స్టేషన్, ఉప్పల్ ఎలక్ట్రికల్ సబ్‌స్టేషన్ ఎదురుగా ఉన్న రహదారి హాప్-ఆన్ స్టేషన్లుగా ఉన్నాయి. స్కైవాక్‌లో అనేక సౌకర్యాలు ఉన్నాయి, వీటిలో ఎనిమిది లిఫ్టులు, నాలుగు ఎస్కలేటర్లు, ఆరు మెట్లు దారులున్నాయి. సాంప్రదాయక స్కైవాక్‌ల కాకుండా ఒక చివర నుండి మరొక చివరకి వెళ్లేందుకు వీలు కల్పిస్తాయి. వెడల్పు 3 మీటర్ల నుండి 4 మీటర్లు, కొన్ని స్ట్రెచ్‌లలో 6 మీటర్ల వరకు ఉబ్బెత్తుగా ఉంటుంది. మొత్తం ఎత్తు 9.25 మీటర్లు. నిర్మాణం గురించి హెచ్‌ఎండీఏ ఇంజనీర్లు మాట్లాడుతూ, పునాది రీన్‌ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్ అని, స్తంభాలు, డెక్ స్టీల్‌తో ఉన్నాయని చెప్పారు. స్కైవాక్ ఉప్పల్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతో పాటు పాదచారుల భద్రతను పెంచుతుందని భావిస్తున్నారు.