NTV Telugu Site icon

Shiv Nadar: దాతృత్వంలో తగ్గేదేలే.. రోజుకు రూ.3కోట్లు ఇచ్చేస్తున్న నాడార్‌

Shiv Nadar

Shiv Nadar

Shiv Nadar: చాలా మంది కుబేరులు ఎంత సంపాదించినా సమాజం కోసం ఎంతో కొంత ఖర్చు చేయాలని భావిస్తుంటారు. దేశంలో కొందరు ప్రముఖ వ్యక్తులు, వ్యాపారవేత్తలు తమ సహృదయాన్ని, దానగుణాన్ని చాటుకుంటున్నారు. దాతృత్వంలో నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ వరుసలో ముందు నిలిచారు ఐటీ టైకూన్‌ శివ్‌ నాడార్‌. సంపాదనలో ఎక్కువ భాగం దాతృత్వానికి ఖర్చు పెడుతూ సమాజంపై తనకు గల ప్రేమను మరోసారి నిరూపించారు. రోజుకు రూ.3 కోట్ల చొప్పున విరాళం ఇస్తూ దాతృత్వం విషయంలో తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ హెచ్‌సీఎల్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ . ఆయన ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.1161 కోట్ల వరకు విరాళంగా అందించినట్టు ఎడెల్‌గివ్ హురూన్ ఇండియా పేర్కొంది. దాతృత్వంలో ఆయన దేశంలోనే మొదటి స్థానంలో నిలిచారు. విప్రోకు చెందిన అజీమ్‌ ప్రేమ్‌జీ వార్షిక విరాళ రూ.484 కోట్లతో రెండో స్థానంలో నిలిచారు. గతంలో వరుసగా రెండేళ్లు అజీమ్‌ ప్రేమ్‌జీ తొలిస్థానంలో నిలిచారని ఈ జాబితా గుర్తు చేసింది.

Hate Speech: మతం పేరుతో ఎక్కడికి చేరుకున్నాం?.. ద్వేషపూరిత ప్రసంగాలపై సుప్రీంకోర్టు

హురూన్‌ ఇండియా తాజాగా విడుదల చేసిన దాతృత్వ జాబితాలో శివ్‌ నాడార్ అగ్రస్థానంలో నిలిచారు. రూ. 411 కోట్ల విరాళంతో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కుటుంబం ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. రూ. 242 కోట్లతో బిర్లా కుటుంబం నాలుగో స్థానంలో ఉంది. దేశంలోనే అత్యంత ధనికుడైన గౌతమ్‌ అదానీ రూ.160 కోట్లతో ఈ జాబితాలో ఏడో స్థానంలో ఉన్నారు. మధ్య స్థాయి ఐటీ కంపెనీ మైండ్‌ట్రీకి చెందిన సుష్మిత, సుబ్రతో బాగ్చీ అండ్‌ రాధ, ఎన్‌ఎస్‌ పార్థసారథి కుటుంబాలు రూ.213 కోట్ల చొప్పున విరాళాలతో ఐదారు స్థానాలను పంచుకున్నాయి. అనిల్ అగర్వాల్ కుటుంబం (రూ.165 కోట్లు), నందన్ నీలేకని (రూ. 159 కోట్లు), ఎ.ఎం నాయక్ (రూ.142 కోట్లు)తో వరుసగా 8, 9, 10 స్థానాల్లో నిలిచారు. జెరోధాకు చెందిన నితిన్ కామత్, నిఖిల్ కామత్ తమ విరాళాలను 300 శాతం పెంచి రూ. 100 కోట్లకు చేర్చారు. 36 ఏళ్ల నిఖిల్ కామత్ ఈ జాబితాలో అత్యంత పిన్న వయస్కుడు కావడం విశేషం. హురున్‌ ఇండియా, ఎడెల్‌గివ్‌ కలిసి సంపన్న దాతల జాబితా విడుదల చేయడం వరుసగా ఇది తొమ్మిదోసారి. 2021 ఏప్రిల్‌ 1 నుంచి 2022 మార్చి 31 వరకు ఇచ్చిన విరాళాల వివరాల ఆధారంగా ఈసారి జాబితాను రూపొందించాయి. కనీసం రూ.5 కోట్లు దానం చేసిన వారికి లిస్ట్‌లో చోటు కల్పించింది.