NTV Telugu Site icon

SRH-HCA: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆరోపణలపై స్పందించిన హెచ్‌సీఏ!

Hca

Hca

ఈరోజు ఉదయం నుంచి హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) పేరు అటు సోషల్ మీడియాలో, ఇటు టీవీల్లో మార్మోగిన విషయం తెలిసిందే. ఉచిత టిక్కెట్ల కోసం హెచ్‌సీఏ తమను దారుణంగా హింసిస్తోందని, వేధింపులు ఇలానే కొనసాగితే హైదరాబాద్‌ నగరాన్ని ఫ్రాంఛైజీ వీడిపోవడానికి సిద్ధంగా ఉందని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌) ఓ లేఖ రాసినట్లు న్యూస్ చక్కర్లు కొట్టాయి. ఈ వార్తలపై హెచ్‌సీఏ అధికార ప్రకటన విడుదల చేసింది. ఆ వార్త‌ల్లో వాస్త‌వం లేదని స్పష్టం చేసింది.

‘ఎస్‌ఆర్‌హెచ్‌యాజ‌మాన్యం అధికారిక ఈమొయిల్స్ నుంచి హెచ్‌సీఏ అధికారిక ఈమొయిల్స్‌కు ఎలాంటి మొయిల్స్‌ రాలేదు. సోష‌ల్ మీడియాల, పలు వెబ్‌సైట్ల‌లో ప్ర‌చార‌మ‌వుతున్న వార్త‌ల్లో వాస్త‌వం లేదు. ఒక‌వేళ నిజంగానే ఈమొయిల్స్ వ‌చ్చుంటే.. ఆ స‌మాచారం హెచ్‌సీఏ లేదా ఎస్ఆర్‌హెచ్ అధికారిక ఈమొయిల్స్ నుంచి కాకుండా గుర్తు తెలియ‌ని ఈమొయిల్స్ నుంచి లీక్ చేయ‌డం వెనుకున్న కుట్ర ఏంటి?. హెచ్‌సీఏ-ఎస్ఆర్‌హెచ్ ప్ర‌తిష్ట‌ను మ‌స‌క‌బార్చేందుకు కొంద‌రు ప‌నిగ‌ట్టుకొని చేస్తున్న దుష్ప్ర‌చారం ఇది. ఈమొయిల్స్ న‌కిలీవా, నిజ‌మైన‌వా? తెలుసుకోవ‌డానికి ఎస్ఆర్‌హెచ్ నుంచి కూడా మీడియా స్ప‌ష్ట‌మైన వివ‌ర‌ణ తీసుకోవాలి’ అని హెచ్‌సీఏ అధ్య‌క్ష కార్యాల‌యం పేర్కొంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ సొంత వేదికైన ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో తమ ఐపీఎల్ మ్యాచ్‌లను ఆడటం గురించి పునరాలోచించుకుంటామని, అవసరమైతే హైదరాబాద్‌ వీడిపోతామని హెచ్‌సీఏ కోశాధికారి శ్రీనివాస్ రావుకు ఎస్‌ఆర్‌హెచ్‌ జనరల్ మేనేజర్ శ్రీనాథ్ ఓ లేఖ రాసినట్లు వార్తలు వెలుబడ్డాయి. ఉచిత టిక్కెట్ల కోసం హెచ్‌సీఏ ఉన్నతాధికారులు, ముఖ్యంగా అధ్యక్షుడు జగన్ మోహన్ రావు.. ఎస్‌ఆర్‌హెచ్‌ను బెదిరింపులు, బ్లాక్‌మెయిల్ చేసినట్లు లేఖలో ఉంది. హెచ్‌సీఏ, అధ్యక్షుడి ప్రవర్తనను బట్టి చూస్తే ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్‌ ఆడడం ఇష్టం లేనట్లుగా అనిపిస్తోందని పేర్కొన్నారు. బీసీసీఐ, తెలంగాణ ప్రభుత్వం, మా యాజమాన్యంతో మాట్లాడి మరో వేదికకు మారిపోతామని రాసుకొచ్చారు. హెచ్‌సీఏ నుంచి గత రెండేళ్లుగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు.