NTV Telugu Site icon

Harrasment: లైంగిక ఆరోపణల నేపథ్యంలో హర్యానా క్రీడా శాఖ మంత్రి రాజీనామా

Haryana Sports Minister

Haryana Sports Minister

Harrasment Allegations on Haryana Sports Minister: శుక్రవారం జూనియర్ అథ్లెటిక్స్ కోచ్ ఫిర్యాదు మేరకు హర్యానా క్రీడా మంత్రి సందీప్ సింగ్‌పై చండీగఢ్ పోలీసులు లైంగిక వేధింపులు, క్రిమినల్ బెదిరింపు కేసు నమోదు చేశారు. లైంగికంగా వేధించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి సందీప్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. తన ప్రతిష్టను చెడగొట్టే ప్రయత్నం జరుగుతోందని, తనపై వచ్చిన తప్పుడు ఆరోపణలపై సమగ్ర విచారణ జరుగుతుందని ఆశిస్తున్నానంటూ.. విచారణ నివేదిక వచ్చే వరకు క్రీడా శాఖ బాధ్యతలను ముఖ్యమంత్రికి అప్పగిస్తానని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో, సందీప్ సింగ్ మంత్రి పదవి నుంచి తప్పుకున్నారు. ఈ కేసులో సమగ్ర దర్యాప్తు చేస్తే నిజానిజాలేంటో బయటపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న విషయం బట్టబయలవుతుందని తెలిపారు.

ఆ మహిళా కోచ్‌ ప్రతిపక్ష పార్టీ ఇండియన్ నేషనల్ లోక్ దళ్ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించింది, మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వం వెంటనే సందీప్ సింగ్‌ను బర్తరఫ్ చేయాలని, ఈ విషయంపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. గత ఏడాది ఫిబ్రవరి నుంచి నవంబర్‌ వరకు సోషల్‌ మీడియాలో పదే పదే మెసేజ్‌ల ద్వారా మంత్రి తనను వేధించారని ఆమె తెలిపారు. అతను తనను అనుచితంగా తాకాడని, మెసేజ్‌లలో తనను బెదిరించాడని, నిరంతర వేధింపుల కారణంగా తాను సోషల్ మీడియా నుండి నిష్క్రమించాల్సి వచ్చిందని ఆమె ఆరోపించింది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపీందర్‌ సింగ్‌ హుడా కూడా ఈ వ్యవహారంపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

License Cancellation: మందుబాబులపై ఉక్కుపాదం.. లైసెన్సులు రద్దు..

ఇప్పటివరకు హర్యానా క్రీడల మంత్రిగా వ్యవహరించిన సందీప్ సింగ్ ఒకప్పుడు క్రీడాకారుడే. ఆయన భారత జాతీయ హాకీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. బీజేపీలో చేరిన సందీప్ సింగ్ పెహోవా నియోజకవర్గం నుంచి గెలిచి మంత్రివర్గంలో పదవి చేపట్టారు. ఆయన జీవితంపై 2018లో ‘సూర్మా’ పేరిట బయోపిక్ కూడా విడుదలైంది. సందీప్ సింగ్ ఎంటీవీలో ప్రసారమయ్యే రోడీస్ కార్యక్రమానికి జడ్జిగానూ వ్యవహరించారు. కాగా, 2007 హాకీ వరల్డ్ కప్ మరో రెండ్రోజుల్లో ప్రారంభం కానుందనగా, ఢిల్లీ వెళ్లేందుకు రైలు ఎక్కుతున్న సందీప్ సింగ్‌కు బుల్లెట్ గాయమైంది. రైల్వే ఏఎస్ఐ తుపాకీ పొరపాటున పేలడంతో బుల్లెట్ సందీప్ సింగ్‌కు తగిలింది. దాంతో నడుము కింది భాగం పనిచేయకపోవడంతో ఏడాది పాటు మంచానికే పరిమితమయ్యాడు. అప్పుడు సందీప్ సింగ్‌కు 20 ఏళ్లు. ఆ తర్వాత కాలంలో పుంజుకుని మళ్లీ హాకీలో రాణించి పేరుప్రతిష్ఠలు అందుకున్నాడు. 2010లో సందీప్ సింగ్ ను అర్జున అవార్డు కూడా వరించింది.

Show comments