Site icon NTV Telugu

IPL 2025: ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్‌ హ్యారీ బ్రూక్‌పై రెండేళ్ల నిషేధం!

Harry Brook Ipl Ban

Harry Brook Ipl Ban

ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్‌ హ్యారీ బ్రూక్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) షాక్‌ ఇచ్చింది. రెండేళ్ల పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడకుండా నిషేధం విధించింది. బ్రూక్‌ వరుసగా రెండో ఏడాది ఐపీఎల్‌ నుంచి తప్పుకోవడమే ఇందుకు కారణం. బ్రూక్‌పై నిషేధం ఐపీఎల్ 2025 నుంచే అమల్లోకి వస్తుంది. ఇంగ్లండ్ బ్యాటర్‌ 2027లో మరలా ఐపీఎల్‌లో ఆడవచ్చు. బీసీసీఐ ఈ విషయాన్ని ఇంగ్లాండ్ మరియు వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)కి తెలియజేసిందని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తమ కథనంలో పేర్కొంది.

వేలంలో అమ్ముడైన ఆటగాడు ఫిట్‌గా ఉన్నా కూడా ఐపీఎల్‌కు వరుసగా రెండు సీజన్లు దూరం అయితే.. లీగ్ నిబంధనల ప్రకారం రెండేళ్ల నిషేధం పడుతుంది. ఐపీఎల్ 2024 సమయంలో హ్యారీ బ్రూక్‌ తన బామ్మ మరణాన్ని కారణంగా చూపి లీగ్‌లో ఆడలేదు. ఈ ఏడాది తన జాతీయ జట్టు భవిష్యత్‌ సిరీస్‌లను దృష్టిలో ఉంచుకుని ఐపీఎల్‌ నుంచి వైదొలుగుతున్నట్లు తాజాగా ప్రకటించాడు. దాంతో వరుసగా రెండేళ్లు ఐపీఎల్‌కు దూరం అయ్యాడు. నిబంధనల ప్రకారం రెండేళ్ల పాటు ఐపీఎల్‌లో ఆడకుండా బ్రూక్‌పై బీసీసీఐ నిషేధం విధించింది.

ఐపీఎల్ 2025 మెగా వేలంలో హ్యారీ బ్రూక్‌ను రూ.6.25 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. లీగ్‌ నుంచి తప్పుకోవడం ఆ ఫ్రాంఛైజీకి తీవ్ర ఇబ్బంది కలిగించేదే. అంతకుముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌)కు ఆడాడు. బ్రూక్‌ స్థానంలో డెవాల్డ్ బ్రెవిస్, మాథ్యూ షార్ట్, సర్ఫరాజ్ ఖాన్ ఢిల్లీ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఐపీఎల్ 2025 మార్చి 22 నుంచి ఆరంభం కానుంది. మార్చి 24న ఢిల్లీ తన తొలి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ను ఢీకొట్టనుంది. విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ACA-VDCA అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో రాత్రి 7.30కు మ్యాచ్ ఆరంభం కానుంది.

Exit mobile version