Site icon NTV Telugu

314 Runs: మైండ్ బ్లోయింగ్ ఇన్నింగ్స్.. వన్డేల్లో 314 రన్స్ బాదిన భారత బ్యాటర్!

Harjas Singh

Harjas Singh

వన్డే క్రికెట్‌లో ఓ బ్యాటర్ సెంచరీ చేయడం సాధారణ విషయమే. డబుల్ సెంచరీ చేయడం చాలా అరుదు కానీ.. ప్రపంచ క్రికెట్‌లో చాలా మందే ఈ ఫీట్ అందుకున్నారు. ఇక 300 బంతులు ఉండే వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ చేయడం అంటే మాములు విషయం కాదు.. ఒకవేళ చేస్తే మహాద్భుతం అనే చెప్పాలి. ఈ అరుదైన రికార్డు తాజాగా చోటుచేసుకుంది. అయితే ఈ ఫీట్ నమోదైంది అంతర్జాతీయ క్రికెట్‌లో కాదు.. డొమెస్టిక్‌ క్రికెట్‌లో. సిడ్నీ గ్రేడ్‌ క్రికెట్‌లో భారత సంతతికి చెందిన ఆస్ట్రేలియన్ బ్యాటర్ హర్జాస్‌ సింగ్‌ 300లకు పైగా స్కోరు చేశాడు.

శనివారం ప్యాటర్న్ పార్క్‌లో సిడ్నీ క్రికెట్ క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో వెస్ట్రన్ సబర్బ్స్ తరఫున హర్జాస్‌ సింగ్‌ ట్రిపుల్ సెంచరీ చేశాడు. 141 బంతుల్లో 314 పరుగులు బాదాడు. హర్జాస్‌ ఇన్నింగ్స్‌లో 35 సిక్సర్లు ఉన్నాయి. హర్జాస్‌ చెలరేగడంతో వెస్ట్రన్ టీం ఏకంగా 474 పరుగులు చేసింది. హర్జాస్‌ దాటికి సిడ్నీకి చెందిన ఇద్దరు బౌలర్లు తమ కోటా 10 ఓవర్లలో 100కు పైగా పరుగులు సమర్పించారు. లక్ష్య ఛేదనలో సిడ్నీ 287 పరుగులే చేసి ఘోర ఓటమిని ఖాతాలో వేసుకుంది. హర్జాస్‌ తన సుడిగాలి ఇన్నింగ్స్‌తో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేశాడు. హర్జాస్‌ పేరు ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది.

హర్జాస్‌ సింగ్‌ అరుదైన ఎలైట్ క్రికెటర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. దేశీయ వన్డే క్రికెట్‌లో హర్జాస్‌ కంటే ముందు ఇద్దరి ట్రిపుల్ సెంచరీ చేశారు. న్యూ సౌత్ వేల్స్ ప్రీమియర్ ఫస్ట్-గ్రేడ్ క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీలు నమోదు చేసిన ఆటగాళ్లలో ఫిల్ జాక్వెస్ (321), విక్టర్ ట్రంపర్ (335) ఉన్నారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జన్మించిన ఈ యువ ఆటగాడు భారతదేశంలో తన మూలాలను కలిగి ఉన్నాడు. అతని తల్లిదండ్రులు భారత సంతతికి చెందినవారు, 2000లో చండీగఢ్ నుంచి సిడ్నీకి వలస వచ్చారు. దక్షిణాఫ్రికాలో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన 2024 అండర్-19 ప్రపంచకప్ ఫైనల్‌లో హర్జాస్ 64 బంతుల్లో 55 పరుగులు చేశాడు. అప్పుడే హర్జాస్‌ తన సత్తాచాటాడు.

Exit mobile version