ఎన్నికలకు ముందు ప్రియాంక, రాహుల్, రేవంత్ ఇచ్చిన ఏ హామీ కూడా అమలు కాలేదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఇవాళ ఆయన నల్లగొండ జిల్లా దేవరకొండలో మాట్లాడుతూ.. ఉద్యోగులకు మూడు డీఏలు అన్నారు… ఒక్క డీఏ కూడా రిలీజ్ చేయని కాంగ్రెస్ ప్రభుత్వం… ఉద్యోగులను మోసం చేసిందన్నారు హరీష్ రావు. విద్యావంతులు, నిరుద్యోగులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలోచన చేసి ఓటు వేయాలని, కాంగ్రెస్ కు ఓటేయడమంటే కాంగ్రెస్ మోసాన్ని బలపరిచినట్లవుతుందన్నారు హరీష్ రావు. ముప్పై రోజులైనా వడ్లు కొనలేదని, తడిసిన ధాన్యం కొనుగోలు చేసే నాథుడు లేడని ఆయన వ్యాఖ్యానించారు. బోనస్ విషయంలో చేతులెత్తేసింది కాంగ్రెస్ ప్రభుత్వమని, ప్రజా క్షేత్రంలో కాంగ్రెస్ కు శిక్ష తప్పదన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా 30 వేల ఉద్యోగాలు ఎలా ఇచ్చారో చెప్పాలన్నారు హరీష్ రావు.
ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పట్ట భద్రులు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని హరీశ్ రావు తెలిపారు. తూకంలో కోతలు, ధాన్యం తడిసి ఇబ్బందులు పడుతున్నారన్నారు. సన్నాళ్లకే బోనస్ ఇస్తామన్నారని.. రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఈ మాట అంటే పరిస్థితి వేరేలా ఉండేదన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిందన్నారు. ఈ పదేళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారో చెప్పాలన్నారు. మీడియా సమావేశం ఏర్పాటు చేయగానే కరెంట్ పోయిందని.. కరెంట్ తాను తెప్పించినాని రేవంత్ అంటాడని.. అసలు కేసీఆర్ ఉన్నప్పుడు ఎప్పుడైనా కరెంట్ పోయిందా? అని హరీశ్ రావు ప్రశ్నించారు.