NTV Telugu Site icon

Harish Rao : వరి ధాన్యానికి బోనస్‌పై కాంగ్రెస్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి

Harish Rao

Harish Rao

వానాకాలం వచ్చినా రైతుల పంట పెట్టుబడి సాయంపై ప్రభుత్వం నోరు మెదపడం లేదని బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు అన్నారు. ఎన్నికలకు ముందు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి… ఇప్పుడు సన్నరకం వడ్లకే ఇస్తామని చెప్పడం సరికాదన్నారు. రైతులను దగా చేయవద్దని కోరారు. అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని రానున్న అసెంబ్లీ సమావేశాల్లో నిలదీస్తామన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం అక్కేనపల్లి గ్రామంలో ఆయిల్ పామ్ మొట్ట మొదటి క్రాప్ కటింగ్ కార్యక్రమంలో హరీశ్ రావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఆయిల్ పామ్ పంటపై చాలామంది రైతుల్లో అనుమానాలు ఉండేవన్నారు. ఖమ్మం సహా ఏపీలోని పలు ప్రాంతాల్లో ఈ పంట ద్వారా రైతులు ఎన్నో లాభాలు పొందుతున్నారన్నారు. మన రాష్ట్రంలోనూ చాలామంది రైతులు ఈ పంటను పండిస్తున్నారని తెలిపారు. ఆయిల్ పామ్ ప్రకృతి ప్రసాదించిన వరమని, రైతుల ఎదుగుదలకు దోహదపడుతుందన్నారు. స్థిర ఆదాయాన్ని ఇస్తుందన్నారు. ఎకరాకు లక్షా 20వేల వరకు ఆదాయం వస్తుందన్నారు. అందుకే కేసీఆర్ హయాంలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు కోసం ప్రోత్సాహం అందించినట్లు చెప్పారు. పంటకు డ్రిప్‌తో పాటు ఎస్సీ, ఎస్టీలకు వంద శాతం సబ్సిడీ అందించామన్నారు.