Harish Rao Slams Congress Government: కాంగ్రెస్ పరిపాలనకు నిన్నటికి రెండేళ్లు పూర్తయింది.. ఒక్క మాట చెప్పాలంటే కాంగ్రెస్ రెండేళ్ల మొండిచేయి చూపెట్టిందని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. తాజాగా తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ పాలన ఆగమాగం ఉందన్నారు. మొదటి రెండేళ్లు పాలన గీటురాయిలా ఉంటుంది.. కానీ ఈ రెండేళ్లు ఏమీ చేయలేదన్నారు. ఈ పాలన నిస్పారం నిరర్ధకం లాగా ఉంది.. మా ప్రభుత్వం రాగానే ఎన్నో కొత్త పథకాలు తెచ్చామని చెప్పారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ లాంటి నూతన పథకాలు తీసుకు వచ్చారు.. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు ఇచ్చిన ప్రజా దర్బార్ కూడా అమలు అవడం లేదని విమర్శించారు. రెండేళ్ల లో ఆత్మస్తుతి పరనింద తప్ప ఏమీ లేదు.. మెట్రో రైలు, ఫార్మా సిటీ లను రద్దు చేశారన్నారు. కేసీఆర్ తెచ్చిన పథకాలను రద్దు చేయడం తప్ప ఏమి చేయలేదన్నారు. ఆదాయం కూడా పూర్తిగా తగ్గిందని ఆరోపించారు. విజయోత్సవాలు కాదు అపజయోత్సవాలు జరుపుకోవాలన్నారు. బిల్లులు అడిగితే విజిలెన్స్ విచారణ, ఏసీబీ దాడులు చేయిస్తున్నారన్నారు.
READ MORE: CBSE Recruitment 2025: ఇంటర్, డిగ్రీ అర్హతతో.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ లో జాబ్స్..
మొత్తం రుణమాఫీ అయ్యింది అంటే నేను రాజీనామాకి సిద్ధం! మీరు సిద్ధమా..? అని మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. “50 రోజులు అయిన మక్కాలు కొన్న పైసలు వేయలేదు.. రైతులకు బేడీలు వేసిన ప్రభుత్వం కాంగ్రెస్ రైతు సంక్షోభ ప్రభుత్వం.. జాబ్ నోటిఫికేషన్ ఇవ్వలేదు కానీ మద్యం దుకాణాలను నోటిఫికేషన్ ఇచ్చారు.. తాగుబోతుల తెలంగాణ వైపు రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు.. ఏ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చిన రాష్ట్రంలో పెద్ద కాంట్రాక్టర్ల బిల్స్ క్లియర్ అవుతున్నవి. 18 వేల కోట్ల బిల్స్ ఇచ్చారు.. నేను ఛాలెంజ్ చేస్తున్న.. నేను చర్చకి అయిన సిద్ధం.. గ్లోబల్ సమ్మిట్ కాదు.. అది గోబెల్స్ సమ్మిట్.. థావోస్ లో ఏం జరిగిందో.. మళ్ళీ అదే జరగబోతుంది.. థావోస్ వెళ్ళి డొల్ల కంపెనీలతో ఒప్పందాలు చేసుకుని రేవంత్ నవ్వులపాలయ్యాడు.. గ్లోబల్ సమ్మిట్ జరుగుతున్న భూమిని కేసీఆర్ ప్రభుత్వం సమీకరించింది.. ఫార్మా సిటీ కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం 13ఎకరాల సమీకరించిన దానిలో రేవంత్ రెడ్డి చెమట చుక్క లేదు.. ఆయన ఆలోచన లేదు.. యువతకు ఉద్యోగాల కోసం కేసీఆర్ ఆలోచన చేస్తే.. ఆ భూములను తన అనుయాయులకు రేవంత్ రెడ్డి పప్పు బెల్లం మాదిరి పంచిపెడుతున్నాడు.. మొదటి ఏడాది పాలనతో చూస్తే.. రెండో ఏడాది రేవంత్ పాలన పెనంలోంచి పొయ్యిలో పడినట్లు అయింది.. మూడో ఏడాది పాలన ఏమవుతుందో చూడాలి..” అని హరీష్‌రావు వ్యాఖ్యానించారు.
