Harbhajan Singh surprised by exclusion of Yuzvendra Chahal in World Cup 2023 India Squad: త్వరలో ప్రారంభం కానున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 కోసం భారత జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. సొంతగడ్డపై జరిగే ప్రపంచకప్ కోసం చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ముందునుంచి అందరూ ఊహించిన జట్టునే ఎంపిక చేసింది. ఆరుగురు బ్యాటర్లు, ముగ్గురు ఆల్‌రౌండర్లు, నలుగురు బౌలర్లు, ఓ వికెట్ కీపర్, ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్ కలిపి 15 మంది జట్టులో ఉన్నారు.
ప్రపంచకప్ 2023 జట్టులో కొందరు స్టార్ ఆటగాళ్లకు స్థానం లభించకపోవడంపై భారత మాజీలు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్‌ను ఎంపిక చేయకపోవడంపై మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. చహల్ మ్యాచ్ విన్నర్ అని పేర్కొన్నాడు. ‘ప్రపంచకప్ 2023 జట్టులో యుజ్వేంద్ర చహల్ లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది. యూజీ ప్యూర్ మ్యాచ్ విన్నర్’ అని హర్భజన్ తన ఎక్స్‌లో పేర్కొన్నాడు.
Also Read: Arun Kumar Sinha: SPG చీఫ్, పీఎం సెక్యూరిటీ గ్రూప్ అధికారి అరుణ్ కుమార్ సిన్హా మరణం
బీసీసీఐ ప్రకటించిన జట్టు స్పిన్ విభాగంలో పెద్దగా ఆశ్చర్యాలేమీ లేవు. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా జట్టులోకి ఎంపికయ్యారు. దాంతో లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్‌కు నిరాశ తప్పలేదు. చహల్ ఇటీవలి కాలంలో పెద్దగా ఆడలేదు. టీ20ల్లో అడపాదడపా అవకాశాలు వచ్చినా.. సద్వినియోగం చేసుకోలేపోయాడు. అదే సమయంలో అతడి సహచర స్పిన్నర్ కుల్దీప్ వికెట్స్ తీస్తూ జట్టుకు ప్రధాన స్పిన్నర్ అయ్యాడు. దాంతో కుల్దీప్ మెగా టోర్నీకి ఎంపికయ్యాడు. చహల్‌కు బ్యాటింగ్ రాకపోవడం కూడా ఓ ప్రతికూలత అని చెప్పాలి.
ప్రపంచకప్‌కు భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, ఆర్ జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, మొహ్మద్ షమీ, మొహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా.