NTV Telugu Site icon

Indian Pitches: ఆ ఆలోచన సరికాదు.. భారత పిచ్‌లపై హర్భజన్‌ సింగ్‌ అసహనం!

Harbhajan Singh

Harbhajan Singh

భారత పిచ్‌లపై టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్‌ సింగ్‌ అసహనం వ్యక్తం చేశారు. మనం గెలవాలని కోరుకోవడంలో తప్పు లేదని, కేవలం మూడు రోజుల్లోపే మ్యాచ్‌ను సొంతం చేసుకోవాలనే ఆలోచన మాత్రం సరికాదన్నారు. తొలి రోజు నుంచే స్పిన్‌ పిచ్‌లను రూపొందించడం వల్ల బ్యాటర్ల ఆత్మవిశ్వాసం దెబ్బతింటుందన్నారు. పేస్‌తో పాటు స్పిన్‌కు అనుకూలంగా ఉండే పిచ్‌లను తయారుచేసి ఆడితే బాగుంటుందని హర్భజన్‌ పేర్కొన్నారు. సెప్టెంబర్ 19 నుంచి భారత్ వేదికగా బంగ్లాదేశ్‌ రెండు టెస్టుల సిరీస్‌ ఆడనుంది. ఈ నేపథ్యంలో పేస్‌తో పాటు స్పిన్‌ పిచ్‌లను తయారు చేయాలని కోరారు.

హర్భజన్ సింగ్‌ తాజాగా స్పోర్ట్స్ టాక్‌తో మాట్లాడుతూ… ‘మనం టర్నింగ్‌ ఎక్కువగా ఉండే పిచ్‌లు తయారు చేసి ఆడుతున్నాం. భారత జట్టు గెలవాలని కోరుకోవడంలో తప్పు లేదు. కానీ కేవలం మూడు రోజుల్లోపే మ్యాచ్‌ను ముగించాలనే ఆలోచన సరికాదు. సాధారణంగా నాలుగో రోజు నుంచి స్పిన్‌కు పిచ్‌లు అనుకూలంగా మారతాయి. ఆ లోపు బ్యాటర్లు పరుగులు చేసేందుకు సమయం ఉంటుంది. ఇప్పుడైతే తొలి రోజు నుంచే స్పిన్‌ తిరుగుతోంది. దాంతో బ్యాటర్ల ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. స్పిన్ పిచ్‌లపై ఏ బ్యాటర్ అయినా సులువుగానే ఔట్‌ అవుతారు’ అని అన్నారు.

Also Read: Suryakumar Yadav: పాపం సూర్యకుమార్‌.. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది!

‘నాణ్యమైన పిచ్‌లు అంటే పేస్‌తో పాటు స్పిన్‌కు అనుకూలంగా ఉండాలి. అలాంటి పిచ్‌లపై ఆడితే చాలు. ఇలాంటి వాటిపైన టీమిండియాను ఓడించే సత్తా మరే జట్టుకు లేదు. భారత జట్టులో అద్భుతమైన పేసర్లు ఉన్నారు. స్పిన్‌ బలంగా ఉంది. ఐదో రోజైనా మనమే విజయం సాధిస్తాం. మంచి పిచ్‌పై బ్యాటర్లూ పరుగులు చేయగలగుతారు. భారీ స్కోరు చేసినప్పుడే వారి ఆత్మవిశ్వాసం ఉన్నతంగా ఉంటుంది. భారత బ్యాటర్లు స్పిన్‌ను ఆడటంలో ఇబ్బంది పడతారని నేను అనట్లేదు. పేస్‌తో పాటు స్పిన్‌కు అనుకూలంగా ఉంటే.. విదేశాల్లో మనం ఆధిపత్యం చెలాయించొచ్చు’ అని హర్భజన్ చెప్పుకొచ్చారు. స్వదేశంలో టీమిండియాకు ఉన్నంత ఆధిపత్యం ప్రపంచంలో ఏ జట్టుకు లేదు. భారతదేశంలో టెస్ట్ సిరీస్ గెలవడం మిగతా జట్లకు ఓ సవాలుగా మారింది. ప్రతి జట్టు భారత్ వచ్చి సిరీస్ ఓటమితో తిరిగి వెళుతోంది. భారతదేశంలో పరిస్థితులు ఎల్లప్పుడూ స్పిన్నర్లకు సహాయపడతాయి.