NTV Telugu Site icon

Basara IIIT: బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థినులకు వేధింపులు?

Basara Iiit

Basara Iiit

Basara IIIT: ఇటీవల కాలంలో నిత్యం ఏదో విధంగా వార్తలో నిలుస్తోంది బాసర ట్రిపుల్ ఐటీ. నిన్న మొన్నటి వరకు హాస్టల్ సమస్య కొనసాగుతుండగానే.. మరో వివాదం వెలుగులోకి వచ్చింది. కాలేజీ ఉద్యోగులు విద్యార్థినులు వేధిస్తున్నారంటూ వార్త ప్రచారం జరుగుతోంది. బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థినులను వేధించిన ఘటనలో బుధవారం ఇద్దరు కాలేజీ ఉద్యోగులను అధికారులు సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. ఓ విభాగంలోని అటెండర్ విద్యార్థులను బ్లాక్ మెయిల్ చేయగా అధికారులకు ఫిర్యాదు చేయడంతో వ్యవహారం బయటపడినట్లు సమాచారం. ఆ విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉద్యోగుల సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని రహస్య విచారణ చేస్తున్నట్లు సమాచారం.

Read Also: Yadadri Thermal Power Plant : యాదాద్రి థర్మల్ ప్లాంట్ ఎంత వరకు సేఫ్ ? అనుమతిపై మరోమారు అధ్యయనం

ఈ ఘటన పై ఆరోపణలు ఎదుర్కొన్న ఉద్యోగి చెబుతూ తనకు దగ్గరి బంధువులు కావడంతో పలకరించేవాడినన్నాడు. అతని భార్యను కళాశాలలోని భవనంలో అధికారులు రహస్యంగా విచారించినట్టు తెలిసింది. సదరు విద్యార్థినులతో తమకు బంధుత్వం లేదని ఆమె స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. వ్యవహారాన్ని ఉన్నతాధికారులకు వివరించిన కాలేజీ అధికారులు ఓ కమిటీ వేసి రహస్యంగా విచారిస్తున్నట్లు సమాచారం. కాగా, మరో ఉద్యోగికి సైతం ఈ వ్యవహారంతో సంబంధం ఉండగా.. తను విధులు నిర్వర్తించే సెక్షన్‌లో అవకతవకలకు పాల్పడినందుకు వేటు వేసినట్లు కళాశాల వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయమై కళాశాల డైరెక్టర్‌ను సంప్రదించగా.. కొందరు కళాశాల నియమాలను అతిక్రమించినట్లు తన దృష్టికి వచ్చిందని తెలిపారు. దీనిపై ఏకసభ్య విచారణ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఏ అంశంపై కమిటీని ఏర్పాటు చేశారని ప్రశ్నించగా జవాబు దాటవేశారు.