NTV Telugu Site icon

Happy Birthday MS Dhoni: ఎంఎస్ ధోనీకి గుర్తింపు వచ్చింది తెలుగు గడ్డపైనే.. ఆ విధ్వంసాన్ని ఎవరూ మర్చిపోలేరు!

Ms Dhoni Visakhapatnam Century

Ms Dhoni Visakhapatnam Century

MS Dhoni’s First Century Came in Visakhapatnam: 2004లో భారత జట్టులోకి కీపర్‌గా ఎంట్రీ ఇచ్చాడు.. కొద్ది కాలంలోనే తిరుగులేని ఫినిషర్‌గా ఎదిగాడు.. 2007లో అనూహ్యంగా కెప్టెన్‌ అయి టీమిండియాకు ఏకంగా టీ20 ప్రపంచకప్ అందించాడు.. భారత క్రికెట్ సంధి దశలోనూ అద్భుతంగా జట్టును ముందుకు నడిపాడు.. భారత అభిమానుల ఏళ్ల కలగా మిగిపోయిన వన్డే ప్రపంచకప్‌‌ను 2011లో అందించాడు.. 2013లో ఛాంపియన్స్ ట్రోఫీని కూడా భారత్‌కి అందించాడు. క్రికెట్ ప్రపంచంలో మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన ఏకైక కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ ఇప్పటికీ రికార్డుల్లో కొనసాగుతున్నాడు. భారత్‌లోనే కాదు ప్రపంచ క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్ ధోనీ.. నేడు 42వ పడిలోకి (Happy Birthday MS Dhoni) అడుగుపెట్టాడు.

2004లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన ఎంఎస్ ధోనీ.. 2020లో రిటైర్మెంట్‌ ప్రకటించాడు. దాదాపు 17 సంవత్సరాల కెరీర్‌లో మహీ పొందని ప్రశంస లేదు, వినని విమర్శ లేదు. తుఫాన్ ఎదురొచ్చినా.. తన పని తాను చేసుకోవడమే అతడిని ఉన్నత శిఖరాలకు చేర్చింది. ధోనీ కెరీర్‌లో చిన్న మచ్చ కూడా వెతికినా దొరకదు. అయితే మొదటి అంతర్జాతీయ మ్యాచ్‌లో రనౌటయి కెరీర్ ప్రారంభించిన ధోనీ.. ఆపై కూడా 2-3 మ్యాచ్‌లలో విఫలమయ్యాడు. ఒక్క ఇన్నింగ్స్ అతడిని రారాజుని చేసింది. ఆ ఇన్నింగ్స్ వచ్చింది కూడా మన తెలుగు గడ్డపైనే. విశాఖలో చేసిన సెంచరీ తనకు ఎప్పుడూ ప్రత్యేకమే అని ధోనీ కూడా చాలాసార్లు చెప్పాడు.

2005లో విశాఖలో దాయాది పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎంఎస్ ధోనీ విధ్వంసం సృష్టించాడు. ఓపెనర్ సచిన్ టెండూల్కర్ (2) త్వరగా ఔట్ కాగానే.. అప్పటి కెప్టెన్ సౌరవ్ గంగూలీ అనూహ్యంగా ధోనీని మూడో స్థానంలో బరిలోకి దించాడు. మరో ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ (74)తో కలిసి వేగంగా పరుగులు చేశాడు. సెహ్వాగ్, గంగూలీ ఔట్ అయినా ధోనీ వేగంగానే ఆడాడు. పాక్ బౌలర్లను ఆటాడుకుంటూ.. 123 బంతుల్లో 15 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 148 రన్స్ చేశాడు. దాంతో ధోనీ అంటే ప్రపంచానికి తెలుసొచ్చింది.

Also Read: World Cup 2023 Qualifiers: స్కాట్లాండ్‌పై సంచలన విజయం.. వన్డే ప్రపంచకప్‌కు నెదర్లాండ్స్‌ అర్హత!

ఇక జైపూర్‌లో శ్రీలంకపై మరో తుఫాన్ ఇన్నింగ్స్‌ ఆడాడు. 145 బంతుల్లో 15 ఫోర్లు, 10 సిక్సర్లతో ఏకంగా 183 పరుగులు చేశాడు. అప్పటికీ వన్డేల్లో ఒక వికెట్ కీపర్ చేసిన అత్యధిక స్కోరు ఇదే. ఈ రెండు ఇన్నింగ్స్‌లతో ధోనీ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. బ్యాటింగ్, కీపింగ్, కెప్టెన్సీతో క్రికెట్ ప్రపంచంలో రారాజుగా వెలుగొందాడు. ధోనీకి కూడా కెరీర్‌లో ఎన్నో ఎదురుదెబ్బలు తగిలాయి. అయినా అన్నింటిని దాటుకుంటూ ముందువెళ్ళాడు. ధోనీకి ముందు, తర్వాత.. భారత్‌కు, ప్రపంచంలో ఎంతో మంది కెప్టెన్లు ఉన్నారు. ఆటే మహీకి ఉండే కూల్ అండ్ కామ్ నేచర్ అతడిని ప్రత్యేకంగా నిలబెట్టింది. భారత మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి పుట్టిన రోజు (MS Dhoni Birthday) శుభాకాంక్షలు.

Also Read: Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి పసిడి రేట్స్ ఎలా ఉన్నాయంటే?