Site icon NTV Telugu

Pemmasani: పెమ్మసాని వార్నింగ్‌.. సింహాలై దూకుతారు జాగ్రత్త..!

Pemmasani

Pemmasani

Pemmasani: టీడీపీ తాజా జాబితాలో గుంటూరు పార్లమెంట్‌ టీడీపీ అభ్యర్థిగా సీటు దక్కించుకున్న డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌.. తన ప్రచారంలో మరింత స్పీడ్‌ పెంచారు.. తన దైన్‌ మార్క్‌ డైలాగ్‌లతో అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీపై విరుచుకుపడుతున్నారు.. ఇవాళ ఎక్కడ చూసినా సిద్ధం పోస్టర్లలో జగన్ ఓ సద్దాం హుస్సేన్ లా కనపడుతున్నారు. ఆ పోస్టర్ల కోసం చేసిన రూ. 200-300 కోట్లతో చేసిన ఖర్చు ఎవరిచ్చారు?’ అని నిలదీశారు. వట్టిచేరుకూరు మండలం కారంపూడి పాడు గ్రామంలో క్లస్టర్, యూనిట్ ఇంచార్జులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు పెమ్మసాని.. ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బూర్ల రామాంజనేయులు కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ పొన్నూరులో జరిగిన గ్రావెల్ అక్రమ తవ్వకాల అవినీతికి కారకులు ఎవరని ప్రశ్నించారు. చనిపోయాక ఎవరైనా పైకి పోవాల్సిందేనని, ఇంతోటి దానికి ఆరు అడుగుల గొయ్యి చాలదా? అని పొన్నూరు కు చెందిన అవినీతి నాయకులను ఎద్దేవా చేశారు. వాలంటీర్ల ద్వారా ప్రజలను ప్రభుత్వం ప్రలోభ పెడుతుందని పెమ్మసాని చెప్పారు. మీ వాలంటీర్లకు చీరలు, గిఫ్టులు కావాలేమోకానీ, మా కార్యకర్తలకు ఎన్టీయార్ పంచిన పౌరుషం, బాబు నేర్పిన క్రమశిక్షణ చాలని పేర్కొన్నారు. పోలింగ్ బూత్ ల వద్ద తమ పార్టీ కార్యకర్తలు సింహాలై దూకుతున్నారు జాగ్రత్త అని వైసీపీని ఆయన సూచన ప్రాయంగా హెచ్చరించారు. ఇన్నేళ్లు ఎన్నో అవమానాలు, ఇబ్బందులు భరించినా జెండా వదలని కార్యకర్తలు మరో 50 రోజులు ఓపిక పట్టాలని ఆయన కోరారు.

ఇక, సమయం లేదు మిత్రమా అంటూ కార్యకర్తలను అప్రమత్తం చేశారు బూర్ల రామాంజనేయులు. ప్రతీ క్లస్టర్ కు కేటాయించిన ఇళ్లకు వారంలో ఒకసారి వెళ్లి కలవాలని, అందులో వైసీపీ సానుభూతి పరులు ఉన్నా సరే, పరిచయం చేసుకోవాలని యూనిట్, క్లస్టర్ ఇన్చార్జిలకు రామాంజనేయులు సూచించారు. అందుబాటులో లేని ఓటర్లను బూత్ కు తీసుకెళ్లి మరీ ఓట్లు వేయించే బాధ్యత మన ఇంచార్జుల పైనే ఉందని ఆయన తెలిపారు. లేకుంటే దొంగ ఓట్లు పడే ప్రమాదం ఉందని, అలాంటి దొంగ ఓట్ల కారణంగానే గత ఎన్నికల్లో టీడీపీ నాయకులు ఓడిపోవాల్సి వచ్చిందని బూర్ల పేర్కొన్నారు. ఈసారి ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసి తీరుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మాకినేని పెదరత్తయ్య, ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ సమన్వయ కర్త వందనా దేవి, ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన ఇన్చార్జి కొర్రపాటి నాగేశ్వరరావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వడ్రాణం హరిబాబు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version