NTV Telugu Site icon

Pemmasani Chandrashekar: టీడీపీకి కంచు కవచంలా నిలబడతాం..

Pemmasani Chandrashekar

Pemmasani Chandrashekar

Pemmasani Chandrashekar: ‘టీడీపీని వైసీపీ అధినేత తక్కువ అంచనా వేశారు. మీరు కాదు కదా, మీ ముని మనవడు కూడా టచ్ చేయలేరు. టీడీపీ, చంద్రబాబు, లోకేష్‌కు, కంచు కవచంలా అడ్డం నిలబడతాం.’ అని అధికార పార్టీపై గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా తాడికొండ నియోజకవర్గ అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్‌తో పెమ్మసాని చంద్రశేఖర్ బుధవారం రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తాడికొండ మండలం దామరపల్లి, పొన్నెకల్లు గ్రామాల్లో ఆయన పర్యటించారు. దారి పొడవున గ్రామస్తులు పూలవర్షంతో స్వాగతం పలకగా.. పలు కూడళ్ళలో ఎక్స్‌కావేటర్ల సహాయంతో భారీ గజమాలతో ప్రజలు తమ ఊళ్ళలోకి ఆహ్వానించారు. కాగా అనంతరం పొన్నెకల్లు ప్రచార ముగింపు సభలో పెమ్మసాని ప్రసంగించారు.

Read Also: YSRCP vs TDP: ఒంగోలులో టెన్షన్‌ టెన్షన్‌.. వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ

ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు హయాంలో ఆయన ఎంతోమంది నాయకులు, పెద్దల వద్దకు వెళ్లి పరిశ్రమలు, ఆస్పత్రులు, రిహాబిలిటేషన్ సెంటర్లు వంటి 120 సంస్థలను తీసుకువచ్చారని చెప్పారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి సమానంగా జరిగిన రోజే ప్రజాస్వామ్యంలో ప్రజలు గుండెలపై చేయి వేసుకొని ప్రశాంతంగా నిద్రపోగలరని తెలిపారు. కన్‌స్ట్రక్షన్ కావాలి – డిస్ట్రక్షన్ కాదు, మా గుంటూరు ప్రజలకు అభివృద్ధి కావాలి, అరాచకం కాదని ఆయన అన్నారు. జగన్‌ ముని మనవడు వచ్చినా టీడీపీని, చంద్రబాబును, లోకేష్‌ను టచ్‌ చేయలేరన్నారు. “ఒక్కసారి ప్రజలంతా టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని గుర్తు చేసుకోండి. మంచి నాయకత్వానికి ఓటేసి అమరావతిని నిలబెట్టుకోవాలి.’ అని తాడికొండ నియోజకవర్గ టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ ప్రజలను ఉద్దేశించి చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైసీపీకి చెందిన ముప్పై కుటుంబాలు టీడీపీ, బీజేపీ పార్టీలో చేరాయి. పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి డాక్టర్ పెమ్మసాని, శ్రావణ్ కుమార్, బీజేపీ నాయకులు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తాడికొండ నియోజకవర్గ జనసేన సమన్వయకర్త విజయ్ శేఖర్, టీడీపీ నాయకులు డాక్టర్ శేషయ్య, అలాగే మండల నియోజకవర్గస్థాయి టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు కూడా పాల్గొన్నారు.