Site icon NTV Telugu

ENG vs PAK: పాక్‌లో కాల్పుల కలకలం.. ఇంగ్లండ్ ఆటగాళ్లకు భద్రత పెంపు

Eng Vs Pak

Eng Vs Pak

ENG vs PAK: 17 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం పాకిస్థాన్‌ పర్యటనకు వెళ్లిన ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్టు ఆ గడ్డపై టెస్టు సిరీస్‌ ఆడడానికి వచ్చిన సంగతి తెలిసిందే. తొలి టెస్టులో అద్భుత విజయం సాధించి రెండో టెస్టుకు సన్నద్ధం అవుతున్న సమయంలో ఇంగ్లండ్ ఆటగాళ్లు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ముల్తాన్‌లో ఆ జట్టు ఆట‌గాళ్లు బ‌స చేసిన హోట‌ల్‌కు స‌మీపంలో కాల్పులు చోటు చేసుకోవడం ఇందుకు కారణమైంది. క్రికెటర్లు ఉన్న హోట‌ల్‌కు కిలోమీట‌ర్ దూరంలో గురువారం ఉద‌యం తుపాకీ కాల్పుల శ‌బ్ధాలు వినిపించాయి. గురువారం ఉద‌యం ఇంగ్లాండ్ ఆట‌గాళ్లు ప్రాక్టీస్ సెష‌న్ కోసం రెడీ అవుతోన్న స‌మ‌యంలో ఈ కాల్పుల శ‌బ్దాలు వినిపించాయి. ఇటీవలే పాక్ మాజీ ప్రధాని, మాజీ క్రికెటర్ అయిన ఇమ్రాన్ ఖాన్‌పై దుండగుడు కాల్పులు జరిపి గాయపరిచిన నేపథ్యంలో తాజా ఘటనతో ఆందోళన రెట్టింపైంది.

దాంతో ఆట‌గాళ్ల భ‌ద్రత‌ను మ‌రింత ప‌టిష్టం చేశారు. కాల్పుల ఘ‌ట‌న‌కు సంబంధించి ఇప్పటికే పాకిస్థాన్ పోలీసులు న‌లుగురు వ్యక్తుల‌ను అరెస్ట్ చేసిన‌ట్లు తెలిసింది. స్థానిక ముఠాల మ‌ధ్య జ‌రిగిన గొడ‌వ‌లో తుపాకీ కాల్పులు జ‌రిగాయ‌ని, ఈ ఘ‌ట‌న‌లో ఎవ‌రికీ గాయాలు కాలేద‌ని పోలీసు అధికారులు వెల్లడించారు. కాల్పుల ఘ‌ట‌న‌తో సంబంధం లేకుండా ఇంగ్లాండ్ ఆట‌గాళ్లు సెక్యూరిటీ మ‌ధ్య ప్రాక్టీస్‌లో పాల్గొన్నట్లు స‌మాచారం. పాకిస్థాన్‌లో ప‌ర్యటిస్తోన్న ఇంగ్లాండ్ ఆటగాళ్లకు ప్రెసిడెంట్‌ స్థాయి సెక్యూరిటీని అంద‌చేస్తున్నారు. మరోవైపు ఈ ఘటన ఇంగ్లండ్ జట్టును పెద్దగా ప్రభావితం చేయలేదు. శుక్రవారం మొదలయ్యే రెండో టెస్టు కోసం ఆటగాళ్లు యథావిధిగా ప్రాక్టీస్ చేశారు. కాగా, 2009 మార్చిలో పాక్ ప‌ర్యట‌న‌లో ఉన్న సందర్భంలో శ్రీ‌లంక క్రికెట్ జట్టు ప్రయాణించిన లాహోర్‌లోని గ‌డాఫీ స్టేడియం స‌మీపంలో దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘ‌ట‌న‌లో ఆరుగురు శ్రీ‌లంక ఆట‌గాళ్లు గాయ‌ప‌డ్డారు. దాంతో పలు జట్లు చాలా కాలం పాటు పాకిస్థాన్ వచ్చేందుకు నిరాకరించాయి.

Marriage Cancel: అది చిన్నగా ఉంది.. ఆ అబ్బాయి నాకు వద్దు

రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఒక మార్పుతో బ‌రిలో దిగ‌నున్నట్లు స‌మాచారం. ఆల్‌రౌండ‌ర్ లివింగ్‌స్టోన్ గాయ‌ప‌డ‌టంతో అత‌డిన స్థానంలో మార్క్‌వుడ్‌ను జ‌ట్టులోకి తీసుకున్నట్లు తెలిసింది. మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ప్రస్తుతం ఇంగ్లాండ్ 1-0 ఆధిక్యంలో ఉంది. శుక్రవారం (నేటి) నుంచి పాకిస్థాన్‌- ఇంగ్లాండ్ మ‌ధ్య ముల్తాన్ వేదిక‌గా రెండో టెస్ట్ ప్రారంభంకానుంది. తొలి టెస్ట్‌లో విజ‌యాన్ని సాధించి జోరు మీదున్న ఇంగ్లాండ్‌.. సెకండ్ టెస్ట్‌లో గెలిచి సిరీస్ కైవ‌సం చేసుకోవాల‌నే ఉత్సాహంతో బ‌రిలో దిగుతోంది. మ‌రోవైపు సొంత గ‌డ్డపై ఎదురైన ప‌రాభ‌వానికి ప్రతీకారం తీర్చుకోవాల‌ని పాకిస్థాన్ భావిస్తోంది.

Exit mobile version