Tragedy: గుజరాత్ రాజధాని అహ్మదాబాదులో విషాదం చోటు చేసుకుంది. కూతురు తరచూ అనారోగ్యం పాలవుతుండడంతో తన బాధ చూడలేకపోయింది. తన మూడు నెలల పసికందును ఆస్పత్రిలోని మూడో అంతస్తునుంచి కిందకు విసిరేసింది.. దీంతో ఆ పసికందు మరణించింది. ఈ సంఘటన ఆదివారం తెల్లవారుజామున అహ్మదాబాద్ అసర్వా ప్రాంతంలోని సివిల్ హాస్పిటల్‌లో జరిగింది. ఆనంద్ జిల్లాకు చెందిన ఆసిఫ్, ఫర్జానాబాను దంపతులకు మూడు నెలల కిందట అమ్రిన్‌బాను అనే పాప పుట్టింది. పాప అనారోగ్యంతో పుట్టడంతో వెంటనే సర్జరీ చేశారు. డిసెంబర్ 14న ఆ పాప ఆరోగ్యం విషమించింది.
Read Also: Human Skulls in a SuitCase: సూట్ కేసు నిండా మనుషుల పుర్రెలు.. కంగుతిన్న కస్టమ్స్ అధికారులు
దీంతో తొలుత నాడియాడ్ ప్రాంతంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమె కడుపు నుండి పేగులో కొంత భాగం పొడుచుకు వచ్చినందున అహ్మదాబాద్ అసర్వా ప్రాంతంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ఆదివారం ఉదయం 23 ఏళ్ల భార్య ఫర్జానాబాను, మూడు నెలల బిడ్డ అమ్రిన్‌బాను కనిపించకపోవడంతో ఆసిఫ్ ఆందోళన చెందాడు. ఆసుపత్రి సిబ్బందిని అలెర్ట్ చేయగా ప్రాంగణంలో మరణించి ఉన్న పాప కనిపించింది. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా ఫర్జానాబాను తన బిడ్డను ఆసుపత్రి మూడో అంతస్తు నుంచి కిందకు పడేసినట్లు తెలిసింది. దీంతో ఆమెను అరెస్ట్ చేశారు. అయితే పుట్టినప్పటి నుంచి కుమార్తె అనారోగ్యంతో ఉండటంతో ఆ చిన్నారి బాధను తట్టుకోలేక ఇలా చేసినట్లు పోలీసులకు ఆమె చెప్పింది. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: Rahul Gandhi: రాహుల్ గాంధీకి.. అఖిలేష్ యాదవ్ షాక్