Site icon NTV Telugu

Gudiwada Amarnath: కోరమాండల్ ఎక్స్ ప్రెస్ లో 170 మంది తెలుగు వారు ఉన్నారు

Amarnath

Amarnath

Gudiwada Amarnath: కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ ఎక్కినవారిలో 170 మంది తెలుగువారున్నారని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ప్రమాద ఘటనలో మృతులు, గాయపడ్డ వారు, మిస్సింగ్ అయిన వారి వివరాలు సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు ప్రమాదానికి గురైన రెండు రైళ్లలోనూ ఏపీకి చెందిన ప్రయాణికులు 200 మందికిపైగా ఉన్నారని అధికారవర్గాలు తెలిపాయి. రిజర్వేషన్ వివరాల ఆధారంగా వివిధ స్టేషన్లలో ఎక్కిన, దిగాల్సిన ప్రయాణికులు మొత్తం 122 మంది ఉన్నారు. ఇందులో కొందరు సేఫ్ గా ఉన్నట్లు తమ కుటుంబసభ్యులు, బంధువులకు సమాచారం ఇచ్చారు. చాలా మంది వివరాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. వారికి ఫోన్లు చేస్తే కలవడంలేదని.. కొంతమందివి, స్విచ్ఛాప్ అని వస్తోందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దీంతో తమ వారు ఎలా ఉన్నారో.. ఏం జరిగిందోనని ఆందోళన చెందుతున్నారు.

Read Also: Odisha Train Accident LIVE UPDATES:పెనువిషాదం.. ఒడిశాకు బయలుదేరిన ప్రధాని మోడీ

రైలు ప్రమాద ఘటనపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఏపీ ప్రయాణికుల వివరాలు తెలుసుకునేందుకు రైల్వే అధికారులు, కేంద్రంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోంది. అలాగే, రాష్ట్రంలోని వివిధ రైల్వే స్టేషన్లలో హెల్ప్ లైన్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రమాదానికి గురైన రైళ్లలోని ప్రయాణికుల వివరాలపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరా తీశారు. అంతేకాకుండా మంత్రి గుడివాడ అమర్నాథ్‌ను ఘటనా స్థలికి వెళ్లాలని అదేశించారు. సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన అనంతరం.. మంత్రి అమర్‌నాథ్‌ నేతృత్వంలోని ముగ్గురు ఐఏఎస్‌ల బృందాన్ని ప్రమాద ఘటనాస్థలానికి పంపారు.

Read Also: Kota Srinivasa Rao: మొన్న చిరంజీవి.. నేడు పవన్.. ఎందుకంత ద్వేషం కోటా..?

మరోవైపు యశ్వంత్‌పూర్ నుంచి హౌరా వెళుతున్న ఎక్స్‌ప్రెస్ రైలులో తిరుపతి స్టేషన్‌లో 18 మంది, చీరాలలో 12 మంది, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, బాపట్ల స్టేషన్లలో ఇద్దరు చొప్పున, బెజవాడలో నలుగురు, రేణిగుంటలో 8 మంది ప్రయాణికులు ఎక్కారని రైల్వే అధికారులు వెల్లడించారు. మొత్తంగా యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో 52 మంది ఏపీ ప్రయాణికులు ఉన్నారు.
షాలిమార్ నుంచి చెన్నై సెంట్రల్‌కు వస్తున్న కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలులో సుమారు 170 మంది ఆంధ్రప్రదేశ్ ప్రయాణికులు ఉన్నట్లు రిజర్వేషన్ వివరాల ఆధారంగా తెలుస్తోంది. ఈ సంఖ్య ఎక్కువే ఉన్నట్టు సమాచారం. ఫస్ట్ ఏసీలో 9, సెకెండ్ ఏసీ 17, థర్డ్ ఏసీ 117, స్లీపర్‌లో 38 మంది ఎక్కినట్టు అధికారులు తెలిపారు. కోరమాండల్ ఎక్స్ ప్రెస్ లో ఎక్కినవారిలో విశాఖపట్నంలో 110, రాజమండ్రి 26, తాడేపల్లిగూడెం 1, ఏలూరు 2, విజయవాడలో 39 మంది దిగాల్సి ఉంది. అదే విధంగా.. ఇదే రైలులో చెన్నై సెంట్రల్‌కు ప్రయాణించేందుకు రాజమండ్రి నుంచి 56 మంది, తాడేపల్లిగూడెంలో 10 మంది, ఏలూరులో 44 మంది, విజయవాడలో 120 మంది ప్రయాణికులు రిజర్వేషన్ చేయించుకున్నారు. ప్రమాదం జరగడంతో వీరి ప్రయాణం రద్దయింది.

Exit mobile version