Site icon NTV Telugu

France: ఫ్రాన్ నుంచి వెళ్లేందుకు 303 మంది భారతీయులకు అనుమతి.. ఎక్కడికి వెళ్తారనేది ఇంకా సందేహమే..

France

France

France: మానవ అక్రమ రవాణా అనుమానంతో దుబాయ్ నుంచి 303 మంది భారతీయులతో సెంట్రల్ అమెరికా దేశం నికరాగ్వాకు వెళ్తున్న విమానాన్ని ఫ్రాన్స్ అధికారులు అడ్డుకున్నారు. అయితే ప్రస్తుతం భారతీయులను ఫ్రాన్స్ నుంచి పంపించేందుకు అనుమతించినట్లు తెలుస్తోంది. ప్రయాణికులు ఈ రోజు అక్కడి నుంచి బయలుదేరే అవకాశం ఉంది.

Read Also: Indian Navy : చైనాను వణికిస్తోన్న భారత్ కొత్త డిస్ట్రాయర్ యుద్ధనౌక

మూడు రోజుల క్రితం ఫ్రాన్స్ అధికారులు విమానాన్ని తమ దేశంలో అడ్డుకున్నారు. అయితే, ప్రస్తుతం భారతీయులు ఎక్కడికి వెళ్తారనే దానిపై స్పష్టత లేదు. సొంత దేశం భారత్‌కి వస్తారా.? లేకపోతే విమానం గమ్యస్థానం నికరాగ్వాకు వెళ్తారా..? విమానం బయలుదేరిన దుబాయ్ వెళ్తారా..? అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. విమానాశ్రయంలోనే న్యాయవాదులు, అనువాదకుల సాయంతో విచారించారు. నలుగురు న్యాయమూర్తుల ప్యానెల్ ప్రయాణికుల్ని విచారించింది. ఆ తర్వాత విమానం బయలుదేరేందుకు అనుమతులు రాగా.. విచారణ ప్రక్రియలో లోపాలు ఉన్నాయంటూ జడ్జీలు విచారణను రద్దు చేశారు. ప్రయాణికుల్లో 10 మంది ఫ్రాన్సులోనే ఆశ్రయం పొందేందుకు అభ్యర్థించినట్లు తెలుస్తోంది. ప్రయాణికుల్లో చాలా మంది తమవారితో హిందీ, తమిళంలో మాట్లాడారు. విదేశీయులను ఫ్రెంచ్ అధికారులు నాలుగు రోజులు మాత్రంమే తమ ఆధీనంలో ఉంచుకోవచ్చు. జడ్జీలు అనుమతిస్తే మరో నాలుగు రోజులు పొడగించొచ్చు, తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే 26 రోజుల వరకు ఫ్రాన్స్‌లో ఉంచుకునేందుకు అనుమతి లభిస్తుంది. పట్టుబడిన భారతీయుల్లో 11 మంది మైనర్లు కూడా ఉన్నారు.

రొమేనియన్ చార్టర్ కంపెనీ లెజెండ్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన విమానంలో వీరంతా దుబాయ్ నుంచి నికరాగ్వా వెళ్తున్నారు. పారిస్‌కి 150 కిలోమీటర్ల దూరంలోని వాట్రీ విమానాశ్రయంలో అధికారులు ఈ విమానాన్ని నిలిపేశారు. ఇంధనం నింపుకునేందుకు వాట్రీలో ల్యాండ్ అయిన సమయంలో ఫ్రెంచ్ అధికారులు వీరిని అడ్డుకున్నారు. అయితే పట్టుబడిన వారు కార్మికులు కావచ్చని, వీరంతా నికరాగ్వా మీదుగా అమెరికా, కెనడాకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని అనుమానిస్తున్నారు.

Exit mobile version