Site icon NTV Telugu

Davos Tour: అనకాపల్లిలో గ్రీన్‌ఫీల్డ్‌ స్టీల్‌ప్లాంట్‌కు అంగీకారం: సీఎం చంద్రబాబు

Cm Chandrababu

Cm Chandrababu

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచదేశాల ఆర్థిక సదస్సు (డబ్ల్యూఈఎఫ్‌)లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్సెలార్‌ మిట్టల్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ లక్ష్మీ మిట్టల్‌తో చంద్రబాబు, లోకేశ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. లక్ష్మీ మిట్టల్‌, సీఈవో ఆదిత్య మిట్టల్‌తో జరిగిన సమావేశంలో తాము పాల్గొన్నాం అని సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా తెలిపారు.

‘అనకాపల్లిలో ఏర్పాటయ్యే ఆర్సెలార్‌ మిట్టల్‌, నిప్పాన్‌ స్టీల్‌ ప్లాంట్‌ అతిపెద్ద ప్రాజెక్టు. ఇటీవల అతిపెద్ద గ్రీన్‌ఫీల్డ్‌ ప్రాజెక్టుల్లో ఒకటిగా ఈ ప్రాజెక్టు నిలుస్తుంది. లక్ష్మీ మిట్టల్‌, సీఈవో ఆదిత్య మిట్టల్‌తో జరిగిన సమావేశంలో పాల్గొన్నాం. 17.8 మిలియన్‌ టన్నుల సామర్థ్యంతో గ్రీన్‌ ఫీల్డ్‌ స్టీల్‌ప్లాంట్‌కు అంగీకారం తెలిపారు’ అని సీఎం చంద్రబాబు ఎక్స్‌లో పేర్కొన్నారు. ఈ పోస్టుకు ఓ ఫొటో జత చేసి.. ఇన్వెస్ట్ ఇన్ ఏపీ అని హ్యాష్ టాగ్ పెట్టారు. ఆర్సెలార్ మిట్టల్‌, జపాన్‌కు చెందిన నిప్పాన్ స్టీల్ జేవీ సంయుక్తంగా 17.8 మిలియన్ టన్నుల కెపాసిటీతో గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్రాజెక్ట్‌ ఏర్పాటు ప్రక్రియను ఏపీలో ప్రారంభించామని లక్ష్మీ మిట్టల్‌ గుర్తు చేశారు. అనకాపల్లి సమీపంలో 2 దశల్లో రూ.1.4 లక్షల కోట్ల పెట్టుబడితో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

Exit mobile version