NTV Telugu Site icon

Pedda Gattu Jathara: ఘనంగా ప్రారంభమైన పెద్ద గట్టు జాతర.. వేలాదిగా హాజరైన భక్తులు

Jathara

Jathara

Pedda Gattu Jathara: తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ ఆధ్యాత్మిక వేడుకగా నిర్వహించే లింగమంతుల స్వామి జాతర ఘనంగా ప్రారంభమైంది. మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర తర్వాత ఇది రాష్ట్రంలో రెండవ అతిపెద్ద జాతరగా ప్రాచుర్యం పొందింది. యాదవుల ఆరాధ్య దైవమైన లింగమంతుల స్వామి జాతర ఆదివారం అర్ధరాత్రి కేసారం నుంచి పెద్దగట్టు దేవరపెట్టే రాకతో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఐదు రోజుల పాటు కొనసాగనున్న ఈ మహాజాతరకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా, దేశంలోని వివిధ ప్రాంతాల నుండి కూడా లక్షలాది భక్తులు తరలివచ్చారు. భక్తులు సంప్రదాయ ఆయుధాలైన కత్తులు, కటర్లు, డప్పులతో స్వామివారిని ఆరాధిస్తూ గుట్ట పైకి చేరుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తుల తాకిడితో పెద్దగట్టు పరిసర ప్రాంతం భక్తిజన సంద్రంలా మారింది. ఇక భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు అధికారులు.

Read Also: Triptii Dimri : అందాల ఆడబొమ్మ.. ఎంత బాగుందో ‘త్రిప్తి డిమ్రి’ ముద్దు గుమ్మ..

విజయవాడ నుంచి హైదరాబాద్‌ వచ్చే వాహనాలను కోదాడ, మిర్యాలగూడ, నల్లగొండ, నార్కట్‌పల్లి మీదుగా మళ్లించేలా ఏర్పాట్లు చేసారు. ఇక సూర్యాపేట జిల్లా దురాజ్‌పల్లిలోని పెద్దగుట్టలో జరిగే లింగమంతుల స్వామి జాతరకు 300 ఏళ్ల చరిత్ర ఉందట. ఈ జాతర ప్రతి రెండేళ్లకోసారి జరుగుతుంది. ఈ జాతర మొత్తం ఐదు రోజులపాటు ప్రతిరోజూ ప్రత్యేక ఉత్సవాలు, పూజా కార్యక్రమాలతో భక్తులను ఆకట్టుకుంటుంది. భక్తులు తమ ఇళ్లలో గంపలు వెళ్లదీసి సంప్రదాయ ఆయుధాలతో గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. యాదవ పూజారులు బోనాలు సమర్పించి పోలు ముంతలు, బొట్లు, కంకణ అలంకరణలు చేసి నైవేద్యం సమర్పిస్తారు.

Read Also: Chhava: చావాను మిస్ చేసుకున్న తెలుగు హీరో ఎవరో తెలుసా..?

స్వామివారి కళ్యాణం సందర్భంగా చంద్రపట్నం వేయడం ప్రత్యేకత. బియ్యం పిండి, పసుపుతో ఆలయాల ఎదుట ముగ్గులు వేసి, దీపాలు వెలిగించి వైభవంగా ఉత్సవం నిర్వహిస్తారు. కేసారం నుంచి తీసుకొచ్చిన పాలు రెండు కొత్త బోనం కుండల్లో పొంగించి మాంసం వండుకొని తినే సంప్రదాయం ఉంది. అనంతరం దేవరపెట్టెను తిరిగి కేసారం గ్రామానికి తరలిస్తారు. జాతర ముగింపు రోజున మకరతోరణం తొలగించి, భక్తులు స్వామివారికి వీడ్కోలు పలుకుతారు. ఐదు రోజులపాటు స్వామి పేరు నినాదాలతో మారుమోగిన పెద్దగట్టు, చివరి రోజు భక్తుల నామస్మరణతో శివమయం అవుతుంది.