Site icon NTV Telugu

Amit Shah: ఐదేళ్లలో అస్సాంను వరదలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం..

Amit Shah

Amit Shah

Amit Shah: వచ్చే ఐదేళ్లలో రాష్ట్రాన్ని వరద రహిత రాష్ట్రంగా మారుస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి శనివారం అస్సాం ప్రజలకు హామీ ఇచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తాను అస్సాంను ఉగ్రవాదం, దాడుల నుంచి విముక్తి కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. ఇప్పుడు మరో ఐదేళ్లు ఇవ్వండి అస్సాంను వరదలు లేని రాష్ట్రంగా చేస్తామని.. అస్సాం ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికను రూపొందించిందని గువాహటిలోని ఖానాపరాలో జరిగిన కార్యకర్తల సమ్మేళనంలో ఆయన అన్నారు. వరదల నుంచి రాష్ట్రాన్ని రక్షించడానికి, మరింత అభివృద్ధి చేయడానికి, గణనీయమైన పెట్టుబడిదారులను ఆకర్షించడానికి మరోసారి బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రాన్ని వరద రహితంగా మార్చడానికి దీర్ఘకాలిక ప్రణాళిక కావాలని.. స్వల్పకాలిక చర్యలను మాత్రమే చూడకూడదన్నారు. అస్సాం ప్రభుత్వం చిత్తడి నేలలను రక్షించడానికి, పునరుజ్జీవింపజేయడానికి ఖచ్చితమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలన్నారు.

ఈ ఏడాది జులై వరకు అస్సాంలో 190 మందికి పైగా వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది ఆ రాష్ట్రం వరదల కారణంగా విపరీతంగా నష్టపోయింది. జూలై 2022లో, 12 జిల్లాల్లో దాదాపు 5.39 లక్షల మంది వరదల బారిన పడ్డారు. జులైలో వినాశకరమైన అస్సాం వరదల కారణంగా అనేక మంది చేపల పెంపకందారులు కూడా భారీ నష్టాలను చవిచూశారు. అనంతరం రాష్ట్రంలో మత్స్య పరిశ్రమను రక్షించేందుంకు రాష్ట్ర ప్రభుత్వం సహాయాన్ని మంజూరు చేసింది. 80 శాతం మంది చేపల రైతులు సుమారు రూ. 1,000 కోట్ల విలువైన నష్టాన్ని చవిచూశారని, ఈ రంగానికి భారీ ఎదురుదెబ్బ తగిలిందని అస్సాం మత్స్యశాఖ మంత్రి పరిమళ్ సుక్లాబైద్య తెలిపారు.

Explosion On Bridge: ఉక్రెయిన్ పై విధ్వంసానికి దిగిన రష్యా.. బ్రిడ్జిని పేల్చేసిన సైన్యం

అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ASDMA) జూలై డేటా ప్రకారం, రాష్ట్రంలో దాదాపు 8.9 మిలియన్ల మంది ప్రజలు వరదల బారిన పడినట్లు తెలిసింది. కొండచరియలు విరిగిపడటంతో రాష్ట్రంలో అప్పటి వరకు 192 మంది ప్రాణాలు కోల్పోయారు. 34 జిల్లాల్లో 2.40 లక్షల హెక్టార్ల పంట భూములు దెబ్బతిన్నాయి. ఆగస్టు 30, 2021న రాష్ట్రంలోని వరదల కారణంగా 3,63,135 మంది నివసించే అస్సాంలోని 21 జిల్లాల్లోని 950 గ్రామాలు ప్రభావితమయ్యాయని వెల్లడించింది. అస్సాం ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 2016 వరదల్లో 64 మంది, 2017లో 160 మంది, 2018లో 45 మంది, 2019 మరియు 2020 సంవత్సరాల్లో వరుసగా 101 మంది, 124 మంది ప్రాణాలు కోల్పోయారు.

Exit mobile version