NTV Telugu Site icon

Telangana: తెలుగు పాఠ్య పుస్తకం ముందుమాటలో తప్పులు.. చర్యలు చేపట్టిన ప్రభుత్వం

Telangana Govt

Telangana Govt

Telangana: తెలుగు పాఠ్య పుస్తకంలో ముందుమాట మార్చకపోవడంతో వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పాఠ్యపుస్తకాల విభాగం డైరెక్టర్‌ శ్రీనివాసచారి, ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌ రాధారెడ్డిపై చర్యలకు ఆదేశాలు జారీ చేసింది. వారిద్దరిని బాధ్యతల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌గా పాఠశాల విద్యా అదనపు డైరెక్టర్‌ రమేశ్‌కు బాధ్యతలు అప్పగించగా.. టీఆర్‌ఈఐఎస్ కార్యదర్శి రమణకుమార్‌కు ముద్రణ సేవల విభాగం డైరెక్టర్‌గా బాధ్యతలు అప్పగించారు. రాష్ట్రంలో ఒకటి నుంచి పదో తరగతి వరకు ప్రభుత్వ బడుల్లో ఇచ్చిన తెలుగు పుస్తకాలను వెనక్కి తీసుకోనున్నారు. పంపిణీ చేయని వాటిని పిల్లలకు ఇవ్వకుండా ఆపారు. 24 లక్షల పుస్తకాల్లోని ముందుమాటలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు, అధికారుల పేర్లను ముద్రించి రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎస్‌సీఈఆర్‌టీ) అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహించారు.

Read Also: TGSRTC: బస్ భవన్‌ను సందర్శించిన ట్రైనీ ఐఏఎస్‌లు

బుధవారం పుస్తకాలను విద్యార్థులకు అందజేస్తున్న సమయంలో ముందుమాటలోని తప్పులను చాలాచోట్ల ఉపాధ్యాయులు గుర్తించి విద్యాశాఖ దృష్టికి తీసుకురాగా ప్రభుత్వం చర్యలు చేపట్టారు. మొదట ఆ పేజీని చించేయాలని ఆదేశించిన అధికారులు తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఆ పేపర్‌ను తొలగిస్తే దాని వెనకున్న వందేమాతరం, జాతీయ గీతం, ప్రతిజ్ఞ లేకుండా పోతాయి. ఈ క్రమంలో మరిన్ని విమర్శలు వస్తాయని భావించి.. పిల్లలకు ఇచ్చిన పుస్తకాలను వెనక్కు తీసుకోవాలని విద్యా శాఖ కమిషనర్ శ్రీదేవసేన డీఈవోలకు ఆదేశాలు జారీ చేశారు. ఆ పేజీ వరకు స్టిక్కర్ అంటించి మళ్లీ పంపిణీ చేసే అవకాశం ఉంది.